KCR News: బీఅర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఅర్ భేటీ - ఫాంహౌస్‌కు వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు వీరే
BRS Party News: బీఆర్ఎస్ పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ భరోసా కల్పించడం, భవిష్యత్ వ్యూహంపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే.
KCR Meets BRS MLAs: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాం హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ లీడర్లు అనూహ్య రీతిలో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న వేళ కేసీఆర్ నిర్వహిస్తు్న్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. అయితే, ఈ సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అనే దానిపై తొలుత ఉత్కంఠ నెలకొంది.
కానీ, హాజరైన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేలు టి.హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి. ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు
అధినేత కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో బాగా సీనియర్లు, సన్నిహితులుగా భావించే వారు సైతం మరో పార్టీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. మరికొందరు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి దాదాపు 20 మందికిపైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో పార్టీ వీడతారని వైరల్ అవుతున్నాయి.