KCR Delhi Tour: ఈ వారం ఢిల్లీకి కేసీఆర్? ఓటమి తర్వాత తొలిసారిగా, పొత్తు కోసమేనా?
KCR News: బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఓ వైపు ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవర్ని కలుస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
![KCR Delhi Tour: ఈ వారం ఢిల్లీకి కేసీఆర్? ఓటమి తర్వాత తొలిసారిగా, పొత్తు కోసమేనా? BRS Chief KCR likely to planing for Delhi tour first time after Telangana Assembly Elections KCR Delhi Tour: ఈ వారం ఢిల్లీకి కేసీఆర్? ఓటమి తర్వాత తొలిసారిగా, పొత్తు కోసమేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/716784b5a60eb8709c1d638bd765e0d41708352334099234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS News: తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా బయటకు రాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ సభకు చాలా రోజుల తర్వాత వచ్చారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని వార్తలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఓ వైపు ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సుమారు ఇంకో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవర్ని కలుస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
ఇబ్బంది పెడుతున్న అధికార పార్టీ!
మరోవైపు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. కేసీఆర్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను బాగా హైలెట్ చేస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం కష్టం అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. అందుకే బీఆర్ఎస్ బలానికి బీజేపీ కూడా తోడైతే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. ఆ విషయంలో బీజేపీ పెద్దలను కేసీఆర్ కలుస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్డీఏతో కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని అన్నారు. త్వరలోనే ఎన్డీఏలో భారీగా చేరికలు ఉంటాయని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను బట్టి.. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం పొత్తు కోసమే అనే వాదనకు బలం చేకూరుతోంది. అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటన అజెండా ఏంటో, ఎవరెవర్ని కలుస్తారనే దానిపై ఇప్పటి వరకూ (ఫిబ్రవరి 19) ఎలాంటి క్లారిటీ లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)