Breaking News Live: సీఎం జగన్ కన్నుకొడితే మేధావులు నోరు తెరుస్తున్నారు.. సీపీఐ నేత నారాయణ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దాని ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు రాష్ట్రాల్లోనూ ఉంది. డిసెంబర్ 11 వరకు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయిన అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా రెండో రోజూ నిలకడగా ఉంది. వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,830 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000గా ఉంది.
చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేడు చివరిరోజుకు చేరుకున్నాయి. చివరి రోజైన బుధవారం నాడు పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి తిరుచానూరు ఆలయానికి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం ఉదయం 4:30 గంటలకు శ్రీవారి ఆలయంలో పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపట్టారు..
తెలంగాణలో..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో ఇంధన ధర తాజాగా తగ్గింది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గి రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు తగ్గి రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
సీఎం జగన్ కన్నుకొడితే మేధావులు నోరు తెరుస్తున్నారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తిరుపతి : రాయలసీమ మేధావుల పేరుతో హడావిడి చేస్తున్న వారి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం వైఎస్ జగన్ కన్నుకొడితే మేధావులు నోరు తెరుస్తున్నారని.. లేకపోతే సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపించారు. మరోవైపు ఆంక్షల పేరుతో అమరావతి రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అమరావతి రైతులను ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మూడు రాజధానుల వల్ల ఎంత నష్టమో ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. ధర్మకర్తల మండలి అమరావతి రైతులకు దర్శన భాగ్యం కల్పించకుండా అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతల ఓవరాక్షన్ ఎక్కువైందన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల, ఎమ్మెల్సీలు
తిరుమల శ్రీవారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, భానుప్రసాదరావు తదితరులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.
ఎమ్మెల్సీగా డాక్టర్ బండ ప్రకాష్ ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ బండ ప్రకాష్ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్ లో జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బండ ప్రకాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీనివాసాచారి, రాజ్యలక్ష్మి, కారు డ్రైవర్‌గా గుర్తించారు. గుడివాడ నుండి తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
బండి సంజయ్‌కు అమిత్ షా ఆఫీసు నుంచి ఫోన్
రేపు అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి నేడు అమిత్ షా కార్యాలయం నుంచి బండి సంజయ్‌కు ఫోన్ వచ్చింది. రేపు అందుబాటులో ఉండాలని వారు కోరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు, పాదయాత్ర, ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనుంది.