Bandi Sanjay: సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి, రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ సెంటిమెంట్ : బండి సంజయ్
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయ లబ్ది పొందేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా సభలో ప్రధాని మోదీ, బీజేపీపై సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (MP Bandi Sanjay kumar) ఖండించారు. సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగబోతోందన్నారు. తన పని ఖతమైందని గ్రహించి తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయ లబ్ది పొందే కుట్రలో భాగంగా మోదీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజమంతా అసహ్యించుకుంటోందన్నారు. దీనిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని(Kalvakuntla Constitution) అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
కరోనా కట్టడిలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచమంతా ప్రశంసిస్తే కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పారాసిటమాల్ సీఎంగా విమర్శలపాలయ్యారన్నారు. మోదీ వద్దకు పోయి వంగి వంగి దండాలు పెట్టడం ఇక్కడికొచ్చి తిట్టడం కేసీఆర్ కు అలవాటైందన్నారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయని, రైతు చట్టాలను పొగిడి ఇప్పుడు విమర్శిస్తుండటం సిగ్గు చేటని బండి సంజయ్ విమర్శించారు. వ్యవసాయ బోర్లకు కరెంటు మీటర్లు(Current Meters) పెట్టాలని కేంద్రం ఏనాడైనా చెప్పిందా? అని ప్రశ్నించారు. బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లుగా నిరూపిస్తే తాను ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు. నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. డిస్కంలకు రూ.48 వేల కోట్లు బాకీ ఎందుకు పెట్టిండో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్-టీఆర్ఎస్ చీకటి ఒప్పందం
కాంగ్రెస్–టీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈరోజు సభలో కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ లోనూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి టీఆర్ఎస్ సభ్యులకు పదేపదే సపోర్ట్ చేశారన్నారు. కేంద్రం అవినీతికి పాల్పడుతోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి నిరూపించాలన్నారు. వారం రోజుల్లో కేంద్రం అవినీతి చిట్టా బయటపెట్టాలని సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉంటూ సహారా, ఈఎస్ఐ స్కాంలో మొదటి ముద్దాయి కేసీఆరే అని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ తాను చేసిన వ్యాఖ్యలను దారి మళ్లించేందుకే సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
Also Read: సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీగా చేస్తారా? బీజేపీ దమన నీతితో దేశం అల్లకల్లోలం : సీఎం కేసీఆర్