Bhima Koregaon Case: వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు వీల్లేదు, పిటిషన్ తిరస్కరించిన స్పెషల్ కోర్టు
హైదరాబాద్ అనుమతించడం వల్ల కేసులో అభియోగాల రూపకల్పనలో జాప్యం జరుగుతుందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
భీమా కోరేగావ్ కేసులో ప్రధాన నిందితుడు, తెలుగు కవి వరవరరావు కంటి చికిత్స కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌కు వెళ్లేందుకు గత శుక్రవారం ముంబయిలోని స్పెషల్ కోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయనను హైదరాబాద్ అనుమతించడం వల్ల కేసులో అభియోగాల రూపకల్పనలో జాప్యం జరుగుతుందని వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది. దశలవారీగా విచారణ ప్రారంభించిన తర్వాత మాత్రమే ఆయనకు హైదరాబాద్ వెళ్లేందుకు వెసులుబాటు కల్పి్స్తామని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 18న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, నిందితుల డిశ్చార్జి అప్లికేషన్స్ ను స్పెషల్ కోర్టు నిర్ణయించి, వారిపై అభియోగాలు మోపాలంటే పరిశీలించాల్సి ఉంటుంది. కోర్టు నిందితులకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను కనుక గుర్తిస్తే, అభియోగాలు మోపవచ్చు. ఇది విచారణ ప్రారంభానికి మార్గం సుగమం చేస్తుంది.
ఈ క్రమంలో నిందితులపై అభియోగాలు మోపాలని, పెండింగ్‌లో ఉన్న డిశ్చార్జి అప్లికేషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ‘‘దరఖాస్తుదారుడు హైదరాబాద్‌కు వెళ్లి మూడు నెలల పాటు ఉండేందుకు అనుమతిస్తే, ఛార్జెస్ ఫ్రేమింగ్ పొడిగించబడుతుంది’’ అని పేర్కొంది. అటువంటి పరిస్థితిలో అతన్ని అనుమతించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వరవరరావు తరఫు న్యాయవాది నీరజ్ యాదవ్ వాదిస్తూ, ముంబయిలో శస్త్రచికిత్స ఖర్చులు ఖరీదైనవని, తెలంగాణలో వరవరరావు పెన్షనర్ అయినందున, ఆయన అక్కడ ఉచితంగా కంటి చికిత్సను పొందవచ్చని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం మాట్లాడుతూ.. ‘‘వరవరరావుకు ముంబయిలో మంచి చికిత్స లభించదని కాదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాష్ శెట్టి ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, వరవరరావు తన శస్త్రచికిత్స ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు. అందువల్ల ఆయన హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అసలు భీమా కోరేగావ్ కేసు అంటే ఏంటి?
మహారాష్ట్రలోని కోరేగావ్ భీమా వద్ద జరిగిన అల్లర్లకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు 2018 జూన్ మొదటి వారంలో కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరంతా ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర చేశారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసులో రోనా విల్సన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని పోలీసులు అప్పట్లో చెప్పారు.
ఆ ఆధారాలతో 2018 ఆగస్టు 28న హైదరాబాద్‌లో పెండ్యాల వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి పుణె తరలించారు. అయితే, పోలీసుల ఆరోపణలను హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని, ప్రశ్నించే గొంతు నొక్కడమే తప్ప మరేమీ కాదని వారించాయి. తర్వాత ఈ కేసు ఎన్ఐఏ విచారణకు వెళ్లింది.
బెయిల్ కూడా తిరస్కరణ
బెయిల్ కావాలని 82 ఏళ్ల వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించగా అది తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే రెండున్నరేళ్లు పోలీసుల కస్టడీలో ఉండడం.. వృద్ధాప్యంలో ఉండడంతో వైద్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ సాధారణ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే, ముంబయి దాటి పోకూడదని షరతు విధించింది. గతంలో ఓ సందర్భంలో వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో విచారణ ఇంకా మొదలు కాలేదని, ఈ రోజు విచారణ మొదలైతే అది పూర్తి కావటానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని అన్నారు.