Bandi sanjay : అవన్నీ వాడుక మాటలే - కవితను కించపర్చలేదన్న బండి సంజయ్ ! మహిళా కమిషన్‌కు ఇంకా ఏం చెప్పారంటే ?
మహిళా కమిషన్ ముందు హాజరై రెండు పేజీల వివరణ లేఖ ఇచ్చారు బండి సంజయ్.
Bandi sanjay : ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. రెండు పేజీల వివరణ లేఖ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ తన వివరణలో కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు చెప్పారు.
మరో వైపు కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట నిరసనకు దిగింది. ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ సమాధానం పట్ల మహిళా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకా విచారణ కొనసాగుతోంది.
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై స్పందించిన బండి సంజయ్... తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని కమిషన్ మండిపడింది. ఆయనపై 354, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కేంద్ర మహిళా కమిషన్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఆ మేరకు హాజరయ్యారు.
మహిళా కమిషన్ ఎదుట బండి సంజయ్ హాజరు అవుతారని ఎవరూ అనుకోలేదు. బండి సంజయ్ వివరణపై సంతృప్తి చెందకపోతే మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా కమిషన్ కు జ్యూడిషియల్ పవర్స్ లేవని చర్యలు తీసుకునే అధికారం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.