(Source: ECI/ABP News/ABP Majha)
Surgical Strike: సీఎం కేసీఆర్ పై కేసు నమోదుకు సిద్ధమవుతున్న అస్సాం పోలీసులు, కారణం అదేనా!
తెలంగాణలో అస్సాం సీఎంపై కేసు నమోదైంది. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు అస్సాంలో సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అస్సాం పోలీసులు సిద్ధం అవుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై అస్సాం పోలీసులకు ఫిర్యాదు అందింది. సర్జికల్ స్ట్రైక్స్ కు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం పోలీసులకు బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్(CM Kcr) ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జికల్ స్ట్రైక్స్ పై ఫ్రూఫ్స్ కావాలని సీఎం కేసీఆర్ డిమాండ్‌చేశారు. సైనికులను కించపరిచే విధంగా, దేశ వ్యతిరేక భావాలు ప్రోత్సహించేలా మాట్లాడారని కేసీఆర్‌పై పోలీసులకు బీజేపీ(Bjp) కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అస్సాం పోలీసులు తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ ధ్రువీకరించింది. సీఎం కేసీఆర్ సర్జికల్ స్టైక్స్ పై చేసిన వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్(Jammu Kashmir) లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు. భారత జవాన్ల ధైర్యసాహసాలపై ఎలాంటి సందేహాలు లేవని, ఫ్రూప్స్ కావాలని ప్రశ్నించిన వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ ఏమన్నారంటే?
సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పట్ల అస్సాం సీఎం హిమంత బిశ్వ(Assam CM Himanta Biswa Sharma) శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని తాను వదిలిపెట్టనన్నారు. అస్సాం సీఎంపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్(Surgical Strike) పై ఆధారాలు బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్చేయడంలో తప్పేంలేదన్నారు. తాను కూడా ఇప్పుడు ఆ ఆధారాలు బయటపెట్టాలని అడుగుతున్నానన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై నిజనిజాలు తెలవాలంటే ఆధారాలు బయటపెట్టాలన్నారు.
అస్సాం సీఎంపై కేసు నమోదు
రాహుల్ గాంధీపై ( Rahul Gandhi ) అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ( Himanta Biswa Sarma ) జుబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revant Reddy ) సోమవారం కేసు పెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్ల కింద అస్సాం సీఎంపై కేసు నమోదు చేశారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికైతే కేసు నమోదు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అస్సాం సీఎం బిశ్వ శర్మ సర్జికల్ స్ట్రైక్స్‌కు రాహుల్ గాంధీ ఆధారాలు అడిగారని ఆయన తండ్రెవరో తాము ఆధారాలు అడిగామా అని ప్రశ్నించారు. ఇవి రాహుల్ గాంధీ తల్లిని కించ పరచరడం కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అస్సాం సీఎంపై కేసుకు కౌంటర్ గా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై అస్సాంలో పోలీసులకు ఫిర్యాదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.