(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ప్రారంభం, అమిత్ షా రాజకీయ తీర్మానం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించినా కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. శనివారం నాడు ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 4 నాటికి ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కొనసీమ, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయి. నెల్లూరు పెంచలకోన - సోమశిల మీదుగా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లగా మారుతుంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో చిరు జల్లులు పడతాయి.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
ఉత్తర తెలంగాణను మేఘాలు కమ్మేశాయి. ఇక్కడి నుంచి ఏపీ వైపుగా మేఘాలు కదులుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నేడు సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ప్రారంభం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు హెచ్ఐసీసీలో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. మొదటి రోజైన శనివారం సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ రాత్రి నోవాటెల్ హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే.
Karimnagar Student Death: కరీంనగర్ జిల్లా జమ్మికుంట న్యూ మిలీనియం స్కూల్ హాస్టల్లో విద్యార్థిని మృతి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట న్యూ మిలీనియం స్కూల్ హాస్టల్లో విద్యార్థిని మృతి చెందడం కలకలం రేగింది. 9వ తరగతి చదువుతున్న తిప్పిరెడ్డి అఖిల అనారోగ్యంతో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని బాలిక పేరెంట్స్ కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు చేరుకున్నారు. అయితే విద్యార్థిని మృతి పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శరీరంపై గాయాలున్నాయని తలకి వెనుకవైపున, పాదాల వద్ద దెబ్బలు తగిలి ఉన్నాయని బంధువులు అన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంధుమిత్రులతో కలిసి వారంతా స్కూలు ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. అయితే సమాధానం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం తాళాలు వేసుకొని వెళ్లిపోవడంతో బాలిక మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
Srikakulam TDP: శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ ఛార్జీల ‘బాదుడే బాదుడు’ అంటూ నిరసనలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో నిరసన చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీల బాధుడే - బాదుడు కార్యక్రమంలో భాగంగా లావేరు మండలం, సుభద్రాపురం జంక్షన్ లో ఆర్.టి.సి బస్సు లో సుభద్రాపురం జంక్షన్ నుండి ఎచ్చెర్ల వరకు ప్రయాణం చేసి ప్రయాణికులతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించి, కరపత్రాలను పంచారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్.టి.సి చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
YS Jagan: ప్యారిస్ నుంచి అమరావతికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. కుమార్తె కాన్వొకేషన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయమే తిరిగి అమరావతికి వచ్చారు. రేపు ప్రధాని మోదీ రాజమహేంద్రవరానికి రానున్నందున ఆ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్‌కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశీల రఘురామ్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.