Breaking News Live Telugu Updates: జహీరాబాద్ మండలంలో బావిలో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో ఈ వారం చివ్వరి వరకు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. కాబట్టి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా స్వల్పంగా పెరుగుతాయని చెప్పారు. తెల్లవారుజామున కొన్ని చోట్ల పొగ మంచుతో మొదలైయ్యే వాతావరణం, మధ్యాహ్నానికి కాస్తంత వెచ్చగా ఉంటుందని, రాత్రికి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయని అంచనా వేశారు. ఈ వారం చివర్లో అంటే ఈ శనివారం, ఆదివారాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
‘‘వచ్చే వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా లేదు. దీని కోసం ఒకటి లేదా రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ వస్తుంది. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుంది.
1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదు.
2) వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ రెండు జిల్లాల్లోనే వర్షాలు
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాత్రం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. విజయవాడకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఈ రెండు రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఆగ్నేయంగా తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
జహీరాబాద్ మండలంలో బావిలో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ లో దారుణం
* కుటుంబ కలహాలతో వ్యవసాయ బావిలో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య
* మృతులు రాజగిరి వెంకటి, రాజగిరి లక్ష్మీ గా గుర్తింపు
* మృతి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు
* బావిలోంచి మృతదేహాలను వెలికితీత చర్యలు చేపట్టిన చిరాగ్ పల్లి పోలీసులు
టి.కాంగ్రెస్ లో సంక్షోభం, 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా
టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతల ఆరోపణలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మాకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కి రాజీనామా లేఖలు పంపారు.
Hyderabad News: పసికందును వదిలేసి వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఒకరోజు వయసు ఉన్న పసికందును ఓ అపార్ట్‌మెంట్ పక్కన పడేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. కమలానగర్ లో రెండు అపార్ట్మెంట్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పసికందును పడేసి వెళ్లిపోయారు. దీనిని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని గాయాలు పాలైన పసికందును ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ నిట్‌కు చేరుకున్న హైకోర్ట్ చీఫ్ జస్టిస్ భుయాన్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి
తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వరంగల్ నిట్ కు చేరుకున్నారు. హై కోర్ట్ జడ్జీలు నవీన్ రావు, నగేష్, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి సైతం నిట్‌కు చేరుకోగా స్వాగతం పలికారు.
Siddipet News: సిద్దిపేటలో వైఎస్ షర్మిల పుట్టిన రోజు వేడుకలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టిపి నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి, ఆస్పత్రిలో రోగులకు పండ్లను, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ షర్మిల 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేలా షర్మిలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూమాఫియా, అవినీతి పెట్రేగిపోయిందని, దానికి వ్యతిరేకంగానే షర్మిల పార్టీని పెట్టి ప్రజలకు అండగా పోరాడుతోందని అన్నారు. షర్మిల ఉద్యమానికి తెలంగాణ ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె గద్దించి, హుస్నాబాద్ గడ్డపై వైఎస్ఆర్టిపి జెండాను ఎగురవేస్తామన్నారు.