(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13 నుండి 18 వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో ఉరుములు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో ఆయా రాష్ట్రాల్లో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలో వర్ష సూచన లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ స్థితి
పశ్చిమ ప్రాంతంలోని ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. అంతేకాక, ఏపీ, యానం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో మొదటి భారీ వర్షాలు, మార్చి 16 న నుంచి మొదలైయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మార్చి 16 న మొదలై మార్చి 17, 18, 19 భారీగా మారి మార్చి 21 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
‘‘మరో నాలుగు రోజుల్లో కర్ణాటక మీదుగా ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడనుంది. దీని వలన తెలంగాణ తో పాటు ఆంధ్రా వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఒక వైపున ఏమో తేమ గాలులు ఈ గాలుల సంగమం మీదుగా రాగా, మరో వైపున ఇప్పటి దాకా కొనసాగుతున్న పొడిగాలులు గాలుల సంగమంలో ఉంటుంది. ఈ రెండు కలయిక వలన వర్షాలు బాగా పిడుగులతో, బలమైన ఈదురుగాలులతో పడనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ నెల 15న తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌లో తెలిపింది.
16న నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మార్చి 15, 16 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు ఒకటిలేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌లో తెలిపింది.
ఢిల్లీలో వాతావరణం ఇలా
ఢిల్లీలో వేడిగాలులు మెల్లగా పెరుగుతున్నాయి. ఆదివారం ఢిల్లీలో గరిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఇది సీజన్ సగటు కంటే ఐదు రెట్లు ఎక్కువగా నమోదైంది, ఇది ఇప్పటివరకు సీజన్‌లో అత్యంత వేడిగా ఉండే రోజు ఇదే అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి కాలం మార్చి 1 నుంచి ప్రారంభమై మే 31 వరకు ఉంటుందని IMD అధికారి తెలిపారు. IMD శాస్త్రవేత్త కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఢిల్లీలో ఇప్పటివరకు ఈ సీజన్‌లో 34.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో హాటెస్ట్ డే ఇదని తెలిపారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనూ తుదిశ్వాస విడిచారని సమాచారం.
తెలంగాణలో దారుణం.. కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
గత కొన్ని రోజులుగా వీధి కుక్కల దాడులు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వీధి కుక్కలు. ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడు కుక్కల దాడిలో మృతిచెందిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో ఈ విషాదం జరిగింది.
Kadapa MLC Elections: కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని పి.ఆర్ హైస్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ సోమవారం
సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓటు వేసే క్యూలైనులు, పార్కింగ్ ప్రదేశాలు , MLC ఎన్నికలు జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని, అక్కడ బందోబస్తు విధులలో ఉన్న పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెంట జమ్మలమడుగు అర్బన్ సీఐ సదాశివయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ఉరేసుకొని రోగి మృతి
- గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ఉరేసుకొని రోగి మృతి
- ఈ నెల పదవ తేదీన విషం తీసుకున్న సాయి (23) ను బంధువులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చేరిక
- మృతుడు మెట్టుగూడకు చెందిన వ్యక్తి
- చికిత్స పొందుతున్న సమయంలో ఎవరికి చెప్పకుండా గాంధీ ఆస్పత్రి ఏడవ అంతస్తుకి వెళ్లి రాత్రి రెండు గంటల సమయంలో ఉరి
- గాంధీ ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం
- వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
- సాయి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలింపు
- దర్యాప్తు చేస్తున్న చిలకలగూడ పోలీసులు
Supreme Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. జూలై 31కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.