Breaking News Live Telugu Updates: నాగోల్ లో కాల్పుల కలకలం, ఒకరికి బుల్లెట్ గాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్ సముద్రంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బలపడుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇప్పుడు ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్రం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడంతో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉన్నట్లుగా తెలిపారు. అటు మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
అదంతా ఫేక్ తుపాను నమ్మొద్దు - ఏపీ వెదర్ మ్యాన్
‘‘గత కొన్ని రోజులుగా వీస్తున్న పొడిగాలుల వలన రాష్ట్రంలోని గాలులు బాగా దుమ్ముతో నిండి ఉంది. ఎప్పుడు ఉత్తర భారత దేశంలోని దుమ్ము గాలులను చూసి మనకు మన దక్షిణ భారత దేశంలో ఇలాంటి వాతావరణం చూడలేము ఏమో అని అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణం, బంగాళాఖాతంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్ధితుల వలన గాలులు భాగా దుమ్ముతో నిండి ఉంది. కానీ డిసెంబరు మొదటి వారంలో రాష్ట్రానికి దగ్గరగా ఉపరితల ఆవర్తనం వస్తుంది కాబట్టి ఈ గాలులలో ఉన్న పొడి తగ్గుతుంది. నిన్న విశాఖ నగరంలో అత్యధికంగా 246 ఏ.క్యూ.ఐ. నమోదయ్యింది, అలాగే తిరుపతి నగరంలో 204 నమోదయ్యింది. రేపటి నుంచి 100 కి తక్కువగానే గాలులలో ఏ.క్యూ.ఐ. ఉండనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 29) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 14 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.
నాగోల్ లో కాల్పుల కలకలం, ఒకరికి బుల్లెట్ గాయాలు
హైదరాబాద్ నాగోల్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ బంగారం షాపులో గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై హైకోర్టు స్టే
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యవర్గ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టులో గురువారం విచారణ చేపట్టింది. అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీఏ సీఇఓను హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఆశ్రమ పాఠశాల క్వార్టర్స్‌లో వార్డెన్ దంపతుల ఆత్మహత్య
అల్లూరి జిల్లాలోని ఆశ్రమ పాఠశాల క్వార్టర్స్‌లో వార్డెన్ దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల సిబ్బంది క్వార్టర్స్‌లో దంపతులు గుజ్జలి రాధ(32), నన్ని సుమన్ (34) బలవన్మరణానికి పాల్పడ్డారు. గుజ్జలి రాధ ఇదే పాఠశాలలో వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నివాస గృహంలో భార్యభర్తలిద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రాయూనివర్శిటీ క్వార్టర్స్ లో యువకుడు ఆత్మహత్య..
ఆంధ్రాయూనివర్శిటీ క్వార్టర్స్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఈ క్వార్టర్స్ 3/4 బ్లాక్ లో నివసిస్తున్న 20 ఏళ్ల మాధవ్ పట్రసి అనే యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం మాధవ మృతదేహాన్ని కేజిహెచ్‌కు తరలించారు. కేసును మూడో పట్టణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులకు బెయిల్ మంజూరు
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ దేశం విడిచి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్తకూడదని ఆదేశించింది.