Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి శనివారానికి మరింత ముందుకు వెళ్లినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ అంతర్గత కర్నాటక పరిసరాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని తెలిపారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పడిన ఉత్తర - దక్షిణ ద్రోణి శనివారానికి బలహీనపడిందని వాతావరణ అధికారులు చెప్పారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల రాగల 48 గంటల్లో మోస్తరు వర్షాలు కురియనున్నాయని వెల్లడించారు.
AP Weather ఆంధ్రప్రదేశ్ లో
ఏపీలో రాగల మూడు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వెల్లడించింది. అయితే ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు.
Telangana Weather: ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉంది. ఏకంగా 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో మే 17న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
నేడు హైదరాబాద్, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘‘ఈ రోజు నుంచి తక్కువ వర్షం పడనుంది. ఇంతకాలం రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడి బంగాళాఖాతంలోని వెళ్లింది. ఇది మరో రెండు రోజుల్లో బర్మా దేశం వైపుగా వెళ్లనుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని తేమను తీసుకొని వెళ్లనుంది. దీని వల్ల వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. మరీ ఎక్కువగా వర్షాలుండవు.
రుతుపవనాలు జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. దీని వల్ల వర్షాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అంతదాక అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. ఎండల తీవ్రత మెల్లగా పెరగనుంది. మే 23 నుంచి విశాఖపట్నం నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. రుతుపవనాల వర్షాలు పెరగడంతో ఈ వేడి జూన్ మొదటి వారంలో తగ్గుముఖం పట్టనుంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడ వేడి మరో మూడు రోజుల్లో పెరగనుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు బాగా పెరిగింది. ఏకంగా పది గ్రాములకు రూ.350 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,050 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,330 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,900 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,050 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,330గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,900 గా ఉంది.
Kurnool News : కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
Kurnool News : కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. హోళిగుంద మండలం గజేహళ్లిలో పెళ్లి మండపంలో పెళ్లికొడుకు హఠాన్మరణం చెందాడు. దీంతో పెద్దలు మరో యువకుడితో పెళ్లి తంతు జరిపించారు.
Shekar Movie : శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
Shekar Movie : హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని ఫెనాన్సియర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు డబ్బు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా సినిమా నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జీవిత డైరెక్షన్ లో రాజశేఖర్ హీరోగా శేఖర్ సినిమా నిర్మించారు.
Kejriwar KCR Meet: కేసీఆర్ - కేజ్రీవాల్ భేటీ, కాసేపట్లో చండీగఢ్‌కు పయనం
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసిఆర్ బృందంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ తదితరులు ఉన్నారు.
Vijayawada: విజయవాడలో మెగా అభిమానుల సమావేశం
విజయవాడలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం అయ్యారు. మురళీ ఫార్చున్ హోటల్ లో జరుగుతోన్న ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
CM KCR Delhi Tour: కాసేపట్లో కేజ్రీవాల్ ఇంటికి సీఎం కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఆయన ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం తర్వాత ఇద్దరు కలిసి చండీగఢ్ వెళ్లనున్నారు. సాగు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి పరామర్శిస్తారు. వారికి సీఎం కేసీఆర్ రూ.3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు.