Breaking News Live: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్షసూచన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
కరీంనగర్ జిల్లా మానకొండూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కారు ఏకంగా చెట్టును ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారు హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కవిత ప్రత్యేక పూజలు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఆలయ సిబ్బంది, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
పాతబస్తీలో దారుణం
హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఓ బాబా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. పాతబస్తీలోని ఓ బాబాను ఆశ్రయించారు. తల్లికి వైద్యం చేస్తూనే ఆమె కూతుర్లపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వీరిలో ఒకరికి పెళ్లి కాగా, ఆమెకు విడాకులు కూడా ఇప్పించి దారుణాలకు పాల్పడ్డాడు. ఆ వివాహితపై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేశాడు. అక్కాచెల్లెళ్లను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, ఆర్థికంగా కూడా కుంగదీశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబాతో పాటు అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. కానీ, తాజాగా స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గి రూ.107.69 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు తగ్గి రూ.94.14 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువగానే పెరిగింది. లీటరుకు రూ.0.31 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.67 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.26 పైసలు పెరిగి రూ.96.74గా ఉంది.
బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వరుసగా రెండు రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా నిలకడగా ఉన్నాయి. వెండి ధర కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,800గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షసూచన
చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన చేసింది. తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 29 అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
నల్లజర్లలో సారాయి తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు
పశ్చిమ గోదావరి జిల్లా నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు చేశారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మూడు సారాయి తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. 13 డ్రమ్ములలో ఉన్న బెల్లం ఊట ధ్వంసం చేసి, మూడు గ్యాస్ సిలిండర్ లు, అల్యూమినియం సామాగ్రిని, ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. 25 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 18న ప్రారంభమైన సమావేశాలు ఇవాళ్టి వరకూ జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు సభలు ఆమోదం తెలిపాయి.
రైలులో అగ్ని ప్రమాదం..
దిల్లీ-ఛత్తీస్‌గఢ్ రైలులో నాలుగు కోచ్‌లలలో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ మెరేనా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రం అందుకున్న కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని కవిత అందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొ్న్నారు.