News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Breaking News Live: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులని పాస్ చేయండి: జగ్గా రెడ్డి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
దీక్ష విరమించిన జగ్గారెడ్డి

తెలంగాణలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన దీక్ష చేపట్టారు. ఈ సంద్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను పాస్ చేశారని.. తెలంగాణలో మాత్రం పరిస్థితి మరోలా ఉందని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారంలోపు ప్రభుత్వం ఏ విషయం ప్రకటించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చనిపోతుంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

పీవీకి ప్రముఖుల నివాళులు

పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద ఆయన సమాధికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. పీవీ నరసింహరావును జాతి రత్నంగా పిలుస్తున్నామని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని అన్నారు. ఇంత పెద్ద పీవీ విగ్రహం దేశంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. ఎన్నో ఉపన్యాసాలు, కవితలు పీవీ మీద వస్తున్నాయని, ప్రమాదం అంచున ఉన్న భారత దేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా గట్టెకించిన ఘనత పీవీదేనని వాణి దేవి గుర్తు చేసుకున్నారు.

క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి: హైకోర్టు

ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ ఆందోళన ఉన్నందున క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. వచ్చే వారం రోజులు వేడుకలు ఉన్నందున ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన నేడు..

సీఎం జగన్ కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. మొదటిరోజు ప్రొద్దుటూరు, బద్వేల్, కడప ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. బద్వేల్ గోపవరంలో రూ.956 కోట్లతో ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు శంకుస్ధాపన చేస్తారు. కడప నగర శివారుల్లోని కొప్పర్తి వద్ద మెగా పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.

Background

హైదరాబాద్‌లోని పబ్స్‌, హోటళ్ల యజమానులకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌, పలువురు అసోసియేషన్‌ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పబ్స్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు పలు పబ్స్‌, హోటల్స్‌ తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ వచ్చేనెలకు వాయిదా పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోతోంది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం ఎండ కాసేంతవరకూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది జనం పడుతున్నారు. అత్యల్ప స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే ఐదు రోజులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో నెలకొనే వాతావరణ అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం..

డిసెంబరు 23న తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ఉష్ణోగ్రతలు మాత్రం రాత్రి వేళ అత్యల్పంగా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తెలంగాణలో పొడి వాతావరణమే ఉండనుంది. చలికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

ఏపీలో ఇలా..
అమరావతిలోని వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాగల ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం
తెలంగాణలో ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 259 మందిని కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేశారు. వీరిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. ఈ నలుగురి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటి వరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,381 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 63 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. వీరి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 22 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలింది. మరో నలుగురి ఫలితాలు ఇంకా రావాల్సిఉంది.