Breaking News Live: క్యాంపు కార్యాలయంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
గోదావరిఖనిలోని గంగా నగర్ వద్ద గల బ్రిడ్జిపై నుండి వెళుతున్న లారీ మరో లారీని ఢీకొంది. ఇందులో ఒక లారీ ఆ పక్కనే వెళ్తున్న ఆటోపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. రామగుండ కి చెందిన షేక్ షకీల్ అతని భార్య రేష్మ, ఇద్దరు చిన్నారులు సహా మరో ఇద్దరు బంధువులతో కలిసి మంచిర్యాలలోని ఇందారం గ్రామానికి ఒక ఫంక్షన్ కి వెళ్తున్నారు. ఫ్లైఓవర్‌పై బొగ్గు లోడుతో వస్తున్న లారీ యూటర్న్ తీసుకుంటూ.. మట్టితో వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. పక్కనే వీరు ప్రయాణిస్తున్న ఆటోపై పడడంతో ఆటోలో ఉన్న షేక్ షకీల్, రేష్మా మరో చిన్నారి మృతి చెందగా.. రెండు నెలల పాపతో సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
తణుకులో సీఎం జగన్ పర్యటన
ఓటీఎస్ పథకం ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ నేడు తణుకులో పర్యటించునున్నారు. ఉదయం 10.15 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 10.20కు తాడేపల్లిలోని హెలీపాడ్ వద్దకు చేరతారు. 10.30 గంటలకు హెలీ కాప్టర్‌లో తణుకు చేరుకుంటారు. 11 గంటలకు హెలీపాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ.. 11.10కు బాలురోన్నత పాఠశాలలోని సభావేదిక వద్దకు చేరి వివిధ స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత 11.20కు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. 12.50 గంటలకు సభ పూర్తయిన తర్వాత ఒంటి గంటకు తిరిగి హెలీకాప్టర్‌లో సీఎం బయలుదేరి తాడేపల్లి పయనం అవుతారు.
నేడు హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. సోమవారం వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, రాజేశ్వర్‌రావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో కలిసి పరిశీలించారు. వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఇన్విటేషన్ కార్డులను వెంట తీసుకురావాలని తలసాని కోరారు.
పెట్రోల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 21) పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే కొనసాగుతోంది. రెండు రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.40గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.35 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.51 గా ఉంది. ఇది రూ.0.32 పైసలు తగ్గింది. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.13 పైసలు తగ్గి రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర రూ.0.12 పైసలు తగ్గి రూ.96.56గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
క్యాంపు కార్యాలయంలో బర్త్ డే కేక్ కట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగాయి. కేక్ కట్ చేసి సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మంత్రులు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స నారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఎంపీలు బాలశౌరి, వేమిరెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో పలువురు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగానాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఏపి సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని స్వామి వారి ఆశీస్సులు పోందడం జరిగిందన్నారు..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. అనునిత్యం ప్రజాసేవలో ఉండే జగనన్న చేసే కార్యక్రమాలు సత్ఫలితాలు అందించాలని కోరినట్లు తెలిపారు..ప్రజలకు సంక్షేమ పధకాలు అందకుండా ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్న తరుణంలో ఆటంకాలు కలుగకుండా చేయాలని స్వామి వారిని ప్రార్ధించడం జరిగిందని ఆయన అన్నారు..
టీడీపీ ఎంపీ ఇంట్లో విషపూరిత పాము కలకలం
శ్రీకాకుళం ఎంపీ, తెలుగు దేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటి ఆవరణలో ఓ పెద్ద పాము భయాందోళన కలిగించింది. శ్రీకాకుళం నగరంలో 80 ఫీట్ల రోడ్డులో రామ్మోహన్ ఇంటి ముందు అతి విషపూరితంగా పిలిచే రక్త పింజర పాము కనిపించింది. ఇది బుసలు కొడుతుండడంతో ఎంపీ సిబ్బంది భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచ్ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆ స్థలానికి చేరుకొని పామును బందించారు.
అమెరికాలో జనగామ జిల్లా వాసి దుర్మరణం
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో జనగామ జిల్లాకు చెందిన ఓ బాలుడు చనిపోయాడు. లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి, రజనీరెడ్డి కుటుంబం అమెరికాలో నివాసం ఉంటోంది. వారి కుమారుడు అర్జిత్‌రెడ్డి(13) మృతి చెందగా.. కుమార్తె అక్షితారెడ్డి(15) ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. రాంచంద్రారెడ్డి పదహారేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఆదివారం రాత్రి వేడుకలకు భార్య రజనీరెడ్డి, పిల్లలతో కలిసి కారులో వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ మహిళ మద్యం మత్తులో కారు నడుపుతూ వీరిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న కుమారుడు అర్జిత్‌రెడ్డి అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. రామచంద్రారెడ్డి, రజనీరెడ్డి, అక్షితారెడ్డి చికిత్స పొందుతున్నారని బంధువులు తెలిపారు.