(Source: ECI/ABP News/ABP Majha)
Dandari Festival: ఘనంగా ఆదివాసీల దండారీ సంబురాలు, దేవుళ్లకు ఏం సమర్పిస్తారంటే?
Dandari Festival: ఆదివాసీల దండారీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలంతా పది రోజుల పాటు సంబురాలు చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
Dandari Festival: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు దీపావళి పండుగను పురస్కరించుకుని దండారీ వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్దమయ్యారు. దీపావళికి పది రోజుల ముందు అన్ని గోండు, కొలాంగూడాల్లో దండారీ వేడుకల సందర్భంగా తమ తమ గ్రామ పటెల్ ఇంటి ఆవరణలో దండారీ వేదికలను రంగు రంగుల విద్యుత్ కాంతుల మద్య అందంగా అలంకరణలు చేసి ముస్తాబు చేసారు. అకాడి అంటే జూన్ మాసంలో వన దేవతల పూజలు చేసినప్పటి నుండి అకాడి దేవతను కొలుస్తూ దీపావళి వరకు ఈ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళికి ముందుగా అందరు మంచిర్యాల జిల్లాలోని గుడిరేవు వద్దనున్న తమ ఆది దైవమైన పద్మల్ పురి కాకోబాబాయి దేవతను దర్శించుకొని గోదావరి స్నానాలు ఆచరించి అక్కడ నుండి సాంప్రదాయ దండారీ వేడుకలను ప్రారంభించారు. అక్కడ నుండి తమ గ్రామాలకు చేరుకొని గ్రామాల్లో తమ ఎత్మసార్ దేవతగా భావించే గుస్సాడి వేషధారణలు వేస్తారు.
తరాలనాటి సాంప్రదాయం 'దండారీ'
మొక్కు ఉన్న వాళ్ళు తమ తాతలకాలంగా గుస్సాడి టోపి ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు ఈ గుస్సాడి వేషధారణ వేస్తారు. నెత్తిపై నెమలిపించాల టోపి, కాళ్ళకు నడుముకు గజ్జలు, మెడలో రుద్రాక్ష మాలలు, ఒళ్ళంతా విభుది, లేదా మసి రాసుకొని భుజానికి ఓ జంతు చర్మం, చేతిలో ఓ రోలుకర్ర, అచ్చం శివుడి వలే అవతరాం ఉంటుంది. వారం రోజులపాటు ఈ గుస్సాడి వేషధారణ అంటే ఒక కఠోరమైన దీక్ష లాంటిది. గుస్సాడి వేషధారణ వేసిన వారు వారం రోజులపాటు స్నానం చేయరు. ఇక తమ గ్రామాల్లో నిర్వహించే దండారీ వేడుకల్లో ఉత్సాహంగా నృత్యాలు చేస్తారు. వారికి తోడుగా చిన్నారులు పరపొరిలుగా చచోయ్ కొలాటాలతో నృత్యాలు చేస్తారు. ఈ ఉత్సవాలను ప్రారంభించే ముందు మహిళలు రెలా రెలా పాటలతో స్వాగతం పలుకుతారు. అటు పటేల్ ఇంటి వద్ద యజమాని తమ దైవం వద్ద నుండి దీపం వెలిగించి బయటకు తీసుకొని వచ్చి వారికి దండారీకి స్వాగతమని ఆహ్వానించి తమ సాంప్రదాయ ఆకాడి, ఎత్మాసార్ దేవతల సామాగ్రి గుస్సాడి వేషధారణకు సంబంధించిన వస్తువులను అందిస్తారు. అప్పుడు చిన్నారులు ఈ కొలాటాలతో పాటలు పాడుతూ స్వీకరిస్తారు. అనంతరం పర్ర వెట్టే గుమ్మెల అనే సాంప్రదాయ వాయిద్యాలను పెద్దలు సమకూర్చి వాయిస్తారు. ఒక పాట అయ్యాక అందులోనుండి గుస్సాడి వేషధారణ వేసే వారు తమ ఆ గుస్సాడి సామాగ్రి తీసుకొని ఎప్పుడు యధావిధిగా ఉండే దుస్తులను తీసి గుస్సాడి వేషధారణ వేస్తారు. చిన్నారుల్లోనూ పరపొరిలుగా అంటే ఆడమగ లాగా వేషాదరణ వేస్తారు.
దండారీ వేడుకల్లో మొదటగా భోగి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అప్పటి నుండి మిగతా అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. భోగి రోజున మొక్కులు ఉన్న వారు కను బొమ్మలను, తల వెంట్రుకలను సమర్పిస్తారు. ఈ ఆచారం అన్నింటికన్న భిన్నంగా ఉంటుంది. కనుబొమ్మలను సమర్పించే సమయంలో అవి కిందపడకుండా జాగ్రత్తగా ఇంటి ఆడపడుచులు ఓ తెల్లని వస్త్రంలో సేకరించి ఎత్మసార్ దేవతకు మొక్కులు చెల్లిస్తారు. దండారీ ప్రాంగణంలో అడుగుపెట్టి పర్ర వెట్టే గుమ్మెల అనే వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తారు. పర్ర వెట్టే వాయిద్యాలతో చచ్చోయ్ అనే కొలాటమాడుతు సందడి చేస్తారు. ఇందులో పులి వేషధారణ, కోడల్ వేషధారణలు ఉంటాయి. గుస్సాడిలు నెమలి పించాలటోపీలు ధరించి చేసే నృత్యాలు వినూత్నంగా ఉంటాయి.
బంధుత్వాలను పెంచే పండుగ
దండారీ అనేది ఆదివాసీలకు చాలా పెద్ద పండుగ. తమ గ్రామాల్లో దండారీ భోగి పూజలు అయిన వెంటనే ఒక గ్రామం వారు మరో గ్రామానికి అతిథిగా వెళతారు. అతిథులకు సాదర ఆహ్వనంతో పాటు ఒక రోజు ఇరువురు కలిసి ఆడిపాడి నృత్యాలు చేసి సందడి చేస్తారు. అనంతరం ఒకరికొకరు కలుసుకొని బంధుత్వం పెంచుకుంటారు. ఇందులో పెళ్ళిళ్ళ కోసం బంధుత్వాలు కూడా జతకడతాయి. నచ్చితే పెళ్ళి మాత్రం వేసవి సమయంలో జరుపుతారు. ఇలా బంధుత్వాలను బలపరిచే ఒక రకమైన వినూత్న ఆచారం ఆదివాసీల్లో ఉంది. దీపావళి అయిన మూడు రోజుల తరువాత కొలబోడి అనే కార్యక్రమం చేస్తారు. కొలబోడి పూజలతో దండారీ వేడుకలు ముగుస్తాయి.
వేడుకలు తిలకించిన పాండిచ్చేరి వర్సిటీ విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడలో ఆదివాసీలు పది రోజుల పాటు ఘనంగా జరుపుకునే దండారీ వేడుకలను పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందిన కేరళ రాష్ట్ర విద్యార్థులు తిలకించారు. ఈ దండారీ వేడుకలు చాలా బాగున్నాయని, ఆదివాసీల సాంప్రదాయం గుస్సాడి వేషధారణ ఇతర అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయని, కల్చర్ ని కాపాడే ఒక నిజమైన వారసత్వం ఆదివాసీల్లో ఉందని, ఈ దండారీ వేడుకల్లో ఆదివాసీలు వాయించె వాయిద్యాలు, వారి నృత్యాలు చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుందన్నారు. అందరు గ్రామస్తులు ఒకేచోటా వేడుకలు నిర్వహించడం చాలా బాగుందని చెప్పారు. ఇది మంచి ఐక్యతగల ఆదివాసీల సాంప్రదాయమని వారు కొనియాడారు. ఆదివాసీల దండారీ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎటా ఒక్కో గ్రామానికి దండారీ సందర్భంగా పదివేల రూపాయలను అందిస్తోంది. అటు గుస్సాడి నృత్యానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడి నృత్య గురువు కనక రాజుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
దసరాకు సెలవులొద్దు, దండారీకి ఇవ్వండి
దండారీ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దసరాకు సేలవులు కాకుండా తమ ఆదివాసీ విద్యార్థులకు దీపావళికి అదికంగా సెలవులు ఇవ్వాలని ఆదివాసీలు కోరుతున్నారు.
ఎందుకంటే దండారీలో ఆదివాసీల ఆచారాలు, కట్టుబాట్లు ముఖ్యంగా కార్యక్రమాలు నిర్వహించాలంటే చిన్నారులు ముఖ్యమని ఆదివాసీలు చెబుతున్నారు. చిన్నారులే పరపొరీలు ఉండి కొలాటమాడతారని చెబుతున్నారు. కాబట్టి దీపావళి అయిపోయే వరకు తమ ఆదివాసీలకు సెలవులు ప్రకటించాలని ఆదివాసీలు కోరుతున్నారు.