YouTube New Rules : AI వీడియోలు ఇక చెల్లవు! మీ యూట్యూబ్ ఛానెల్ భవిష్యత్తు ఏంటీ? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
YouTube New Rule: యూట్యూబ్‌లో వీడియోలు చేసి డబ్బులు సంపాదించే వాళ్లకు బిగ్ అలర్ట్. ఇకపై వ్యూస్ కోసం చేసే వీడియోలపై కఠినంగా వ్యవహరించాలని గూగుల్ నిర్ణయించింది.

YouTube కొత్త నియమం: YouTube ఇప్పుడు తన మానిటైజేషన్ పాలసీలో పెద్ద మార్పులు చేయబోతోంది. దీనివల్ల ఒకే విధమైన లేదా ఏఐ సహాయంతో కంటెంట్‌ను తయారుచేసే క్రియేటర్స్‌పై కొరడా ఝుళిపించనున్నారు. ఈ మార్పు జులై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఒరిజినల్స్‌ను ప్రోత్సహించనుంది. కేవలం వ్యూస్ కోసం తయారు చేసిన వీడియోలను గుర్తించి వాటి రీచ్‌ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అసలైన కంటెంట్‌కు ప్రోత్సాహం ఇవ్వాలి
Google యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫారమ్ ఒక సపోర్ట్ పేజీలో దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసింది. YouTube Partner Programme (YPP) కింద "మాస్-ప్రొడ్యూస్డ్", "రిపీటెడ్" కంటెంట్‌ను గుర్తిస్తాని, రివ్యూ చేసే ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని తెలిపింది. YouTube ఎల్లప్పుడూ అసలైన, ప్రామాణికమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేసింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరో అడుగు ముందుకేసినట్టు కంపెనీ పేర్కొంది.
YouTube యొక్క కొత్త నిబంధనలు ఏమిటి?
YouTube మానిటైజేషన్ పాలసీలో ఇప్పటికే, YouTube నుంచి డబ్బు సంపాదించే క్రియేటర్స్ కంటెంట్ అసలైనదిగా ఉండాలి. కొత్త విధానంలో రెండు విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది:
కంటెంట్ ప్రామాణికత: మరే ఇతర కంటెంట్‌ను పెద్ద మార్పులు లేకుండా ఉపయోగించకూడదు. తీసుకున్నా, అది కొత్తగా కనిపించేలా, మీ సొంతగా క్రియేటివిటీ ఉపయోగించి మార్పులు చేయడం అవసరం.
రిపీటెడ్ కంటెంట్ నిషేధం: అదే విధమైన టెంప్లేట్‌లలో తయారు చేసినా, పదేపదే పునరావృతం చేసిన, కేవలం వ్యూస్ పొందాలనే ఉద్దేశ్యంతో తయారు చేసే వీడియోలకు రీచ్ ఉండదు. అలాంటి వీడియోలను అనుమానాస్పదంగా చూడబోతోంది YouTube. ఇందులో కష్టపడకుండా క్రియేట్ చేసే కంటెంట్, క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, ఎటువంటి ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్మెంట్ లేకుండా తయారు చేసిన వీడియోలు ఉన్నాయి.
AI కంటెంట్ కూడా రాడార్‌లో వస్తుందా?
YouTube నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత ట్రెండ్‌లను పరిశీలిస్తే, మానవ సహకారం లేకుండా వాయిస్ లేదా రియాక్షన్స్‌ను జోడించిన AI రూపొందించిన వీడియోలు కూడా ఈ కొత్త నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
డబ్బు సంపాదించాలంటే క్వాలిటీ కంటెంట్ అవసరం
YouTube పాలసీ ప్రకారం, మానిటైజేషన్ కోసం ఇప్పటికే కొన్ని కనీస నిబంధనలు ఉన్నాయి. అవి కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉండాలి. 12 నెలల్లో 4,000 చెల్లుబాటు అయ్యే పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 10 మిలియన్ చెల్లుబాటు అయ్యే షార్ట్స్ వ్యూస్. ఇప్పుడు ఈ నిబంధనలు పూర్తి చేసిన తర్వాత కూడా కంటెంట్ నాణ్యత, ప్రామాణికత క్రియేటర్ సంపాదిస్తారా లేదా అనేది నిర్ణయిస్తుంది.
YouTube చర్య వల్ల ఎలాంటి శ్రమ లేకుండా వీడియోలు క్రియేట్ చేసి సంపాదించవచ్చని ఆశిస్తున్న వారందరికీ ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు శ్రమ, సృజనాత్మకత, అసలైన కంటెంట్ మాత్రమే ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిలబడగలవు.





















