Meta AI Tool: ప్రాంప్టింగ్ ఇస్తే చాలు పెయింటింగ్ రెడీ అయిపోతుంది, అదిరిపోయే AI టూల్
Meta AI Tool: మెటా సంస్థ టెక్స్ట్‌ని డిజిటల్ పెయింటింగ్ మార్చే కొత్త AI టూల్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జస్ట్ ప్రాంప్టింగ్ ఇస్తే, వెంటనే డిజిటల్ ఇమేజ్ ఇచ్చేస్తుంది ఈ టూల్.
ఇన్‌పుట్ ఇలా ఇస్తే..అవుట్‌పుట్ అలా వస్తుంది..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో అద్భుతాలు చేయొచ్చని ఇప్పటికే నిరూపించాయి టెక్ సంస్థలు. రకరకాల AIటూల్స్‌తో రకరకాల ఎమోజీలను, ఎక్స్‌ప్రెషన్స్‌ను క్రియేట్ చేసింది మెటా (Facebook)సంస్థ. ఇప్పుడు మరో కొత్త AI టూల్‌తో ముందుకొచ్చింది. దీని పేరు మేక్ ఏ సీన్ (Make a Scene). అంటే డిజిటల్ పెయింటింగ్ అన్నమాట. బ్రష్ పట్టుకోకుండానే క్షణాల్లో పెయింటింగ్ చేయొచ్చు. జస్ట్ మీరు అనుకున్నది ఊహించుకుని ప్రాంప్ట్ చేస్తే చాలు. చకచకా డిజిటల్ పెయింట్ సిద్ధమైపోతుంది. ఈ టూల్‌తో ఏకంగా స్టోరీబుక్స్‌నే క్రియేట్ చేసుకోవచ్చు అంటోంది మెటా సంస్థ. AI రీసెర్చ్‌ను ఈ టూల్ మరింత అడ్వాన్స్‌డ్‌గా మార్చుతుందని స్పష్టం చేస్తోంది. టెక్స్ట్ డిస్క్రిప్ష్‌ను ఇన్‌పుట్‌గా
ఇచ్చినా అందుకు సంబంధించిన పెయింట్ రెడీ అయిపోతుంది. అయితే...ఇక్కడో సమస్య ఉంది. మీరు చెప్పింది చెప్పినట్టుగా పెయింటింగ్‌లో కనపడకపోవచ్చు అంటోంది సంస్థ. ఊహకు కూడా అందని ఇన్‌పుట్ ఇచ్చిన సందర్భాల్లో ఇది అక్యురేట్‌గా పని చేయక పోవచ్చు. ఉదాహరణకు మీరు "మోటార్ సైకిల్‌పై గుర్రం" అనే ఇన్‌పుట్ ఇచ్చారనుకుందాం. అది ఏ మేరకు ఆ ఇన్‌పుట్‌ని పెయింటింగ్‌లా మార్చుతుందనేది చెప్పటం కష్టమే. కాకపోతే...భావాలను ఎక్స్‌ప్రెస్ చేయటానికి, మనం ఊహించుకున్నది ఇమేజ్ రూపంలో చూడాలనుకున్నప్పుడు గానీ...ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది.
మెటా అవతార్ స్టోర్స్ కూడా
ఇందులో పెయింటింగ్‌కు సంబంధించిన లే అవుట్‌లు కూడా ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్‌ని ఇన్‌పుట్‌గా ఇచ్చుకోవచ్చు. ఈ టూల్ దానంతట అదే లే అవుట్‌ను జనరేట్ చేయటమే కాకుండా, వాటిని అందంగా చూపిస్తుంది. ఈ మేక్ ఏ సీన్ టూల్ కేవలం ఆర్టిస్ట్‌లకే కాదు. అసలు పెయింటింగ్‌పై అవగాహన లేని వారి కోసం కూడా అంటోంది మెటా సంస్థ. మెటా సంస్థ గతంలోనూ ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. త్వరలోనే "మెటా అవతార్ స్టోర్స్"ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. అంటే మనరూపంలో ఉన్న ఓ మెటావర్స్అవతార్‌ను క్రియేట్ చేసుకుని మనకు ఏ ఫ్యాషన్ నప్పుతుందో చూసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మెటా అవతార్ స్టోర్స్ డిజిటల్ డిజైనర్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాషన్ పార్టనర్‌షిప్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవా చెన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఉన్న సమయంలో ఈ విషయం ప్రస్తావించారు జుకర్‌బర్గ్. ఫ్యాషన్ విషయంలో యువత ఏం కోరుకుంటోందో అదే వాళ్లకు చేరువ చేయాలని, ఈ మెటా అవతార్ స్టోర్స్ ద్వారా వాళ్లకు నచ్చిన ఔట్‌ఫిట్‌లను సెలెక్ట్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. మెటావర్స్‌లో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించు కోవచ్చని అంటున్నారు జుకర్ బర్గ్. క్రియేటివ్ ఎకానమీని పెంచుకునేందుకు ఇలాంటి ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.