Wimbledon 2024 Winner: వింబుల్డన్ సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్, వరుసగా రెండో ఏడాది జకోవిచ్‌కు షాక్
Wimbledon 2024 Singles Winner Carlos Alcaraz: వింబుల్డన్ 2024 గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ వరుసగా రెండో ఏడాది జకోవిచ్‌పై నెగ్గాడు.
Wimbledon 2024 Winner Carlos Alcaraz: వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ ఛాంపియన్‌గా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ ఆదివారం (జులై 14) రాత్రి జరిగిన వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్‌పై 6-2, 6-2, 7-6(4) తేడాతో విజయం సాధించాడు. వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ విజేతగా నిలిచాడు అల్కరాజ్. తాజా ఫైనల్లోనూ 2023 వింబుల్డన్ ఫైనల్ రిజల్ట్ రిపీట్ అయింది. గత ఏడాది ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ చేతిలో ఓటమిపై సెర్బియా దిగ్గజం నోవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు.
తాజా ఫైనల్లో విజయంతో అల్కరాజ్ ఖాతాలో రెండో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరింది. ఓవరాల్‌గా అల్కరాజ్ ఖాతాలో ఇది నాలుగో గ్రాండ్ స్లామ్. యువ సంచలనం ఆటతీరు చూస్తే కొత్త శకం మొదలైందా అని టెన్నిస్ విశ్లేషకులు భావిస్తున్నారు. దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్‌ల శకం ఇక ముగింపునకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఇదివరకే రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఎదుట ఉన్నది, తాను తలపడుతున్నది 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన జకోవిచ్‌తో. కానీ ఏ టెన్షన్ లేకుండా యువ సంచలనం అల్కరాజ్, జకోను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రత్యర్ధి బలాన్ని, అతడి ఖాతాలో ఉన్న టైటిల్స్ చూసి వెనకడుకు వేయకుండా పోరాటం చేయడంతో అల్కరాజ్ ఖాతాలో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ చేరుతున్నాయి.
Astounding Alcaraz 🤩
— Wimbledon (@Wimbledon) July 14, 2024
The Spaniard defends his #Wimbledon title with a stunning straight sets victory over Novak Djokovic, 6-2, 6-2, 7-6(4) 🇪🇸 pic.twitter.com/bEbT9HwMZh
అల్కారాజ్ రికార్డులు
1968 తరువాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ నెగ్గిన ఆరో టెన్నిస్ ప్లేయర్ అల్కరాజ్. కేవలం 21 ఏళ్లకే రెండు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా యువ సంచలనం అల్కరాజ్ నిలిచాడు. ఓవరాల్‌గా ఇది అల్కరాజ్ కెరీర్ లో నాలుగో గ్రాండ్ స్లామ్.
తొలి సెట్ ను 6-2 తో నెగ్గిన అల్కరాజ్, రెండో సెట్‌లోనూ దూకుడు కొనసాగించాడు. రెండో సెట్ సైతం 6-2 తో నెగ్గాడు. కీలకమైన మూడో సెట్‌లో దిగ్గజ ఆటగాడు జకోవిచ్ పోరాడినా ఫలితం లేకపోయింది. మూడో సెట్ ట్రై బ్రేకర్‌కు వెళ్లగా చివరికి అల్కరాజ్ 7-4తో ఉత్కంఠకు తెరదించాడు అల్కరాజ్. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన జకోవిచ్ కు వరుసగా రెండో ఏడాది అదే ప్రత్యర్థి చేతిలో ఓటమి ఎదురవగా, డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ ఖాతాలో రెండో వింబుల్డన్ టైటిల్ చేరింది.