Tokyo Olympics 2020 Live Updates: బాక్సింగ్‌లో పతకం ఖాయం చేసుకున్న లవ్లీనా, సెమీస్ చేరిన పీవీ సింధు... పతకం లేకుండా వెనుదిరిగిన ఆర్చర్ దీపిక
Tokyo Olympics 2020 Day 5 Live Updates: జపాన్ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ - 2020 ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఒకే ఒక్క పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
LIVE
Background
Tokyo Olympics 2020: జపాన్ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ - 2020 ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఒకే ఒక్క పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మీరాబాయి చాను రజతం గెలిచింది. నాలుగో రోజు(సోమవారం) క్రీడల్లో భారత్‌కు నిరాశ తప్పలేదు. పతకం తెస్తుందనుకున్న టేబుల్ టెన్నిస్ క్రీడకారిణి మనిక బాత్ర 3వ రౌండ్లో ఓడిపోయింది. బాగా ఒత్తిడికి గురవ్వడంతో మ్యాచ్ ఓడిపోయినట్లు మనిక మ్యాచ్ అనంతరం తెలిపింది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీకి చుక్కెదురైంది. అతానుదాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్స్‌లో 0-6తో కొరియా చేతిలో చిత్తయింది. టెన్నిస్‌లో సుమిత్ నగాల్ కూడా ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నగాల్ 2-6, 1-6తో ప్రపంచ రెండో ర్యాంకర్ డానియల్ మెద్వెదెవ్ (రష్యా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో సానియామీర్జా-అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హాకీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. పూల్-ఎ పోరులో భారత్ 0-2 గోల్స్‌తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ చేతిలో ఓడింది.
మహిళల ఫెన్సింగ్‌లో భారత్ తరఫున భవానీదేవి బరిలో దిగింది. తొలి రౌండ్లో 15-3తో నడియా బెన్ (ట్యూనీసియా)పై గెలిచిన భవాని.. రెండో రౌండ్లో 7-15తో ప్రపంచ మూడో ర్యాంకర్ మానొన్ బ్రూనెట్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడింది. స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ విఫలమయ్యాడు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో 1 నిమిషం 56:38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సెమీస్ చేరలేకపోయాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లైలో అతడు పోటీపడాల్సి ఉంది. స్విమ్మింగ్‌లో ఇప్పటికే మానా, శ్రీహరి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. తొలి ఒలింపిక్స్ ఆడుతున్న ఆసియా రజత పతక విజేత ఆశిష్ కుమార్ (75 కిలోలు) పోటీల నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ఆశిష్ 0-5తో తౌహెటా (చైనా) చేతిలో ఓడాడు.
Tokyo Olympics 2020: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న భారత హాకీ టీమ్
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జపాన్ జట్టుపై 5-3 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. పూల్ ఏ గ్రూపులో రెండో స్థానంలో నిలిచింది.
సెమీఫైనల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు... జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి పై 21-13, 22-20తో విజయం సాధించి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది.
పతకం లేకుండానే ముగిసిన దీపిక కథ
ఎన్నో ఆశలతో, కచ్ఛితంగా పతకం గెలుస్తుందనుకున్న నంబర్ వన్ భారత ఆర్చరీ క్రీడాకారిణి దీపిక కుమారి తీవ్ర నిరాశతోనే వెనుదిరిగింది. మహిళల వ్యక్తిగత పోటీల్లో దీపిక క్వార్టర్ ఫైనల్‌లో కొరియా ఆర్చర్ ఆన్ సేన్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. దీంతో ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.
జబీర్ @ 33
పురుషుల 400మీ. హార్డిల్స్ హీట్స్‌లో జబీర్ హీట్-7లో 5వ స్థానంలో నిలిచాడు ఓవరాల్‌గా 33వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
హాకీలో మహిళల జట్టు విజయం
మహిళల హాకీలో ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. నాలుగో క్వార్టర్లో నవనీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ గెలిచింది.