T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?
ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఎంఎస్ ధోనీ మెంటార్‌గా వచ్చాడు. పదేళ్లుగా ప్రపంచకప్ గెలవని కోహ్లీసేన ఈసారి అద్భుతం చేస్తుందా? అంత బలం మనకుందా?
టీమ్‌ఇండియా ప్రపంచకప్ గెలిచి పదేళ్లు దాటింది. 2011లో వన్డే ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత జట్టు అదరగొట్టినా ఐసీసీ టోర్నీలో సెమీస్, ఫైనళ్లలో తడబడుతోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తాజా టీ20 ప్రపంచకప్‌లో ప్రస్థానం ఆరంభిస్తోంది. మరి ఈ టోర్నీలో కోహ్లీసేన బలాలేంటి? బలహీనతలేంటి? ఎంఎస్ ధోనీ మెంటారింగ్‌తో ఉపయోగం ఎంత?
వ్యూహకర్తగా ధోనీ
ఈ ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్యానికి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీ రాలేదు. టోర్నీ సాంతం జట్టు రాణించినా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతోంది. కేవలం 1 లేదా 2 శాతం బలహీనతతో ఫైనళ్లలో వెనుదిరుగుతోంది. ఇప్పుడు ఎంఎస్ ధోనీ రాకతో ఆ బలహీనత కాస్త తగ్గే అవకాశం ఉంది. ఫీల్డర్ల మోహరింపు, పిచ్ అధ్యయనం, వాతావరణం, పరిస్థితులు, వ్యూహాల్లో అతడి భాగస్వామ్యం జట్టుకు కొండంత బలం కానుంది. కోహ్లీ, రోహిత్, రవిశాస్త్రితో కలిసి అతడు వ్యూహాలు రచించనున్నాడు.
యూఏఈ పిచ్‌లపై అనుభవం
యూఏఈ పిచ్‌లు, వాతావరణంపై భారత ఆటగాళ్లకు ఇప్పుడు పూర్తి అవగాహన లభించింది. ఐపీఎల్ రెండు సీజన్లు ఇక్కడే ఆడటంతో పట్టు దొరికింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజాకు తమ పాత్రలపై స్పష్టత లభించింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువీ సైతం ఇక్కడ రాణించారు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అనుభవం, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాయి. మిగతా ఆటగాళ్లూ ఫర్వాలేదు.
తిరుగులేని ఫామ్!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019కి ముందు ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. ఆ తర్వాత వరుసగా ఎనిమిది టీ20 సిరీసుల్లో విజయాలు అందుకుంది. 2020లో ఐపీఎల్ ముగిశాక ఎక్కువ మ్యాచులేమీ ఆడలేదు. కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో 1-2 తేడాతో టీమ్‌ఇండియా ఓడింది. అయితే అది రెండో ప్రధాన్య జట్టు. పైగా కొవిడ్ సెగ తగిలింది. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ 72 మ్యాచులాడితే 45 గెలిచింది. విజయాల శాతం 66గా ఉంది.
ఈ బలహీనత దాటాలి
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియాకు ఒక బలహీనత ఉంది. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు భారీ లక్ష్యాలను నిర్దేశించడం లేదు. పైగా మిడిల్ ఓవర్లలో రన్‌రేట్ తక్కువగా ఉంటోంది. 2019 నుంచి మిడిల్ ఓవర్లలో ఇంగ్లాండ్ రన్‌రేట్ 8.72గా ఉంది. ఆ తర్వాత కివీస్ (8.62), దక్షిణాఫ్రికా (8.25), పాకిస్థాన్ (8.12) ఉన్నాయి. భారత్ ఐదో స్థానంలో ఉంది. మధ్య ఓవర్లలో ఓవర్‌కు 7.93 పరుగులే చేస్తోంది. అంటే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య జోరు పెంచాలని అర్థం. అయితే 2020 నుంచి టీ20 డెత్ ఓవర్లలో జడ్డూ 55.71 సగటు, 207 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం శుభపరిణామం.
బంతితో దాడి ఓకే
ఈ ప్రపంచకప్ కోసం భారత్ ఏకంగా నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను తీసుకుంది. యూఏఈలో ఇది మంచి వ్యూహమే. మణికట్టు స్పిన్నర్ రాహుల్ చాహర్, సీనియర్లు అశ్విన్, జడేజా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ అత్యంత కీలకం. అయితే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల టెంప్లేట్ అనుసరించే ధైర్యం చేస్తారా అన్నది తెలియదు. పేసుగుర్రం బుమ్రా యూఏఈలో అద్భుతంగా రాణించి వికెట్లు తీశాడు. షమి మంచి ఫిట్‌నెస్‌తో ఐపీఎల్‌లో వికెట్లు తీశాడు. భువీకి అనుభవం, నైపుణ్యాలు ఉన్నాయి. అయితే అదనపు పేసర్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నదే ప్రశ్న. హార్దిక్ బౌలింగ్ చేస్తే ఉపయోగం. లేదంటే శార్దూల్‌ను తీసుకోక తప్పదు.
భారత జట్టు అంచనా
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి/ భువనేశ్వర్ కుమార్
Also Read: మొదటి సారి సూపర్ 12కు క్వాలిఫై అయిన జట్టు ఇదే.. ఇక నుంచి అసలు సమరం!
Also Read: సీఎస్‌కే, డీసీ, ఎంఐ, ఆర్‌సీబీ హ్యాపీ.. హ్యాపీ! బీసీసీఐ గుడ్ న్యూస్!
Also Read: ఆ జట్లే ఫేవరెట్.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవుతారట: వార్న్ జోస్యం
Also Read: విరాట్ కోహ్లీ కన్నా బాబర్ ఆజామ్ అంత గొప్పా? పాక్-భారత్ పోరులో విజేత ఎవరు?