Australia Open 2024: బ్యాట్ పట్టిన జకో, రాకెట్ పట్టిన స్మిత్
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ క్రికెట్‌లో సత్తా చాటాడు.
ఆస్ట్రేలియా( Australian) స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ క్రికెట్‌లో సత్తా చాటాడు. ఏంటి వార్త తప్పుగా ఉంది అనుకుంటున్నారా... కాదు కాదు మీరు విన్నది నిజమే. స్టీవ్ స్మిత్ టెన్నీస్ రాకెట్ పట్టి సత్తా చాటాగా... జకోవిచ్ బ్యాట్‌తో సిక్సులు బాది ఔరా అనిపించాడు. ఈ ఆసక్తికర మ్యాచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికగా మారింది. ఈనెల 14న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రచారంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్‌తో కలిసి ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సరదాగా మ్యాచ్ ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి తమ రోల్స్‌ను మార్చుకున్నారు. స్మిత్ టెన్నిస్ రాకెట్ పట్టగా.. జొకోవిచ్ బ్యాట్ పట్టి తన క్రికెటింగ్ స్కిల్స్ చూపించాడు. తొలి గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభానికి మూడు రోజుల ముందు జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో జొకోవిచ్, స్టీవ్ స్మిత్‌తో పాటు పలువురు దిగ్గజ క్రీడాకారులు పాల్గొని అభిమానులను అలరించారు.
స్మిత్ టెన్నీస్ ప్రావీణ్యం
ఇందులో భాగంగా జొకో సర్వీస్‌ను స్మిత్ సరైన రీతిలో చక్కగా కోర్టు లోపలే రిటర్న్ చేసి టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్ని చాటాడు. దీంతో స్మిత్ ఆటతీరుతో ఆశ్చర్యానికి లోనైన జొకోతో పాటు అభిమానులు కూడా చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే జొకోవిచ్ కూడా క్రికెట్ బ్యాట్‌తో టెన్నిస్ బంతిని ఆడాడు. అయితే బ్యాట్‌తో సరిగా ఆడలేకపోవడంతో టెన్నిస్ రాకెట్‌ను ఉపయోగించి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.
సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించడం ద్వారా... తన గ్రాండ్ స్లామ్స్ కౌంట్ 22కు పెంచి రఫెల్ నాదల్ ను సమం చేశాడు.
నాదల్ దూరం
22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ దూరంగా ఉంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలో తొడ కండరానికి గాయమైందని నాదల్ తెలిపాడు. ఈ గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్వీట్ చేశాడు. గాయం వల్ల ప్రస్తుతం 5 సెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లతో పోటీ పడటానికి తాను సిద్ధంగా లేనని నాదల్ వెల్లడించాడు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడి చెప్పినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం కోర్టులోకి దిగాలని గతేడాది చాలా శ్రమించానని.. కానీ కీలకమైన టోర్నీకి ముందు ఇలా జరగడం బాధగా ఉందని నాదల్ అన్నాడు. తన లక్ష్యం మాత్రం మరిచిపోనని... మరో మూడు నెలల్లో రాకెట్ పడతానని నాదల్ తెలిపాడు. మెల్‌బోర్న్ ప్రేక్షకుల ముందు ఆడలేకపోతుండటం బాధాకరంగా ఉంది. దిగ్గజ ఆటగాళ్లు బరిలో ఉండే ఈ మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లైనా ఆడే వీలుంటే సంతోషించేవాడినని నాదల్ అన్నాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జోర్డాన్ థాంప్సన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ ఓటమి సమయంలో నాదల్ గాయంతో బాధపడ్డాడు. జనవరి 5న 3 గంటల 26 నిమిషాల వరకు సాగిన ఈ పోటీలో నాదల్ తీవ్రంగా పోరాడాడు.