IPL Spot Fixing: రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా? పార్టీలకే రూ.2లక్షలు ఖర్చు చేస్తాను తెలుసా! స్పాట్ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్
కెరీర్లో అద్భుతంగా ముందుకు సాగుతున్న దశలో కేవలం రూ.10 లక్షల కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేస్తానని క్రికెటర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు! ఆ సమయంలో తాను సీరియస్‌గా క్రికెట్ ఆడుతున్నానని వెల్లడించాడు.
టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై మాట్లాడాడు. తానెలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నాడు. కెరీర్లో అద్భుతంగా ముందుకు సాగుతున్న దశలో కేవలం రూ.10 లక్షల కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేస్తానని ప్రశ్నించాడు! ఆ సమయంలో తాను సీరియస్‌గా క్రికెట్ ఆడుతున్నానని వెల్లడించాడు.
Also Read: సంజు @ 3000.. ఆ ఘనత అందుకున్న 19వ ఆటగాడిగా రికార్డు
'నేనప్పుడే ఇరానీ ట్రోఫీ ఆడాను. దక్షిణాఫ్రికా సిరీసు ఆడేందుకు సిద్ధమవుతున్నాను. దాంతో మేం 2013లో గెలవొచ్చని భావించాం. ముందుగానే అక్కడికి వెళ్లాలని అనుకున్నాం. ఆ సిరీసు ఆడటమే నా లక్ష్యం. అలా సన్నద్ధమవుతున్న వ్యక్తిగా నేనెందుకు అవినీతికి పాల్పడతాను. అదీ కేవలం రూ.10 లక్షల కోసం? నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. కేవలం పార్టీలు ఇస్తేనే నేను రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తుంటాను' అని శ్రీశాంత్ అన్నాడు.
Also Read: ఢిల్లీతో కోల్‌కతా ఢీ.. నైట్‌రైడర్స్‌కు కీలకం!
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్నప్పుడు అభిమానులు, కుటుంబ సభ్యులు తనకెంతగానో మద్దతుగా నిలిచారని శ్రీశాంత్ చెప్పాడు. 'నా జీవితంలో నేనెంతో మందికి సాయం చేశాను. నమ్మకం కలిగించాను. నిజానికి వారి ప్రార్థనలు, అభిమానం వల్లే నేనీ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నుంచి బయటపడ్డాను' అని అతడు పేర్కొన్నాడు.
దాదాపుగా తన కాలికి 12 శస్త్రచికిత్సలు చేసిన తర్వాతా 130 కి.మీ వేగంతో బంతులు వేశానని శ్రీశాంత్ తెలిపాడు. తన ఓవర్లో 14 పరుగులు వచ్చినా తొలి నాలుగు బంతుల్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చానని గుర్తు చేశాడు. 'ఆ ఓవర్లో ప్రత్యర్థికి 14+ పరుగులు అవసరం. నేను తొలి నాలుగు బంతులు వేసి కేవలం ఐదు పరుగులే ఇచ్చాను. ఒక్క నోబాల్, వైడ్ వేయలేదు. ఆ మ్యాచులో నెమ్మది బంతే విసరలేదు. నా కాలికి 12 శస్త్రచికిత్సలు జరిగిన తర్వాతా 130+ వేగంతో బంతులు విసిరాను' అని శ్రీ చెప్పాడు.
Also Read: ఎట్టకేలకు ఒక్క విజయం.. రాజస్తాన్‌పై ఏడు వికెట్లతో రైజర్స్ విన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శ్రీశాంత్ సహా మరో ఇద్దరి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీశాంత్ రెండు ప్రపంచకప్‌లు గెలిచాడు. ఐసీసీ టీ20, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లు సాధించిన జట్టులో ఉన్నాడు. అలాంటిది అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. బీసీసీఐ అతడిపై శాశ్వతంగా నిషేధం విధించగా అతడు వివిధ కోర్టుల్లో పోరాడి విజయం సాధించాడు. బీసీసీఐ అంబుడ్స్‌మన్ సైతం అతడి నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించి ఉపశమనం కలిగించాడు. ప్రస్తుతం కేరళ జట్టు తరఫున శ్రీశాంత్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్, వివిధ లీగ్ క్రికెట్ ఆడాలన్నది అతడి అభిలాష!