India U-19 World Cup: అండర్-19 భారత్ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్... ప్రపంచకప్‌లో కరోనా కలకలం
కరేబియన్ గడ్డపై జరుగుతున్న అండర్19 ప్రపంచ కప్‌ను కరోనా షేక్ చేస్తోంది. టీమిండియాలో ప్రధానమైన ఆటగాళ్లంతా కరోనా బారిన పడ్డారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరికీ వైరస్ సోకింది.
భారత్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌ను కరోనా టార్గెట్ చేసింది. భారత్ కెప్టెన్ యశ్ ధుల్ సహా ఆరుగురికి వైరస్ సోకింది.
భారత అండర్ -19 జట్టు కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తోపాటు నలుగురు ఆటగాళ్లకు కరేబియన్‌లో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం వాళ్లు జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు ముందే వాళ్లకు పాజిటివ్ నిర్దారణైంది.
ధూల్, రషీద్‌తోపాటు బ్యాటర్లు ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ కూడా వైరస్ బారినపడ్డారు. దీని కారణంగా ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 గ్రౌండ్‌లోకి దిగలేకపోయింది.
“మంగళవారం భారతీయ ఆటగాళ్లు పాజిటివ్ వచ్చింది. వాళ్లంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. మ్యాచ్‌కు ముందు మా కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో కూడా పాజిటివ్ వచ్చింది. ”అని బిసిసిఐ అధికారి పిటిఐకి తెలిపారు.
“అందుకే వైరస్ బారిన పడిన వారందర్నీ ముందు జాగ్రత్త చర్యగా వాళ్లను టీం నుంచి తప్పించాం. ఐసోలేషన్‌లో ఉంచాం. కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ను వైరస్ అటాక్ చేసింది. 17 మందితో కూడిన జట్టును విండీస్ పంపించారు. అందుకో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు. మిగిలిన 11 మందిని ఐర్లాండ్ మ్యాచ్ కోసం ఆడిస్తున్నాం. మిగతా వాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నారు”అని అధికారి తెలిపారు.
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్-19 జట్టుకు నిశాంత్ సింధు నాయకత్వం వహించాడు. ఈ టోర్నమెంట్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మొత్తం 17 మంది ఆటగాళ్లను పంపేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ఇప్పుడు భారత్‌కు కలిసి వచ్చింది.
ప్లేయింగ్ 11జట్టు గ్రౌండ్‌లోకి దిగకపోయినా సరే ఐర్లాండ్ మ్యాచ్‌లో యువభారత్ జట్టు అదరగొట్టింది. ముందు బ్యాటింగ్ చేసిన యువ భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. హర్‌నూర్ సింగ్ 88 పరుగులు చేస్తే రఘువంశీ 79 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ నిశాంత్ సింధు, రాజ్‌వర్ధన్ రెచ్చిపోయారు. రాజ్‌వర్ధన్ 17 బంతుల్లో ఐదు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఐర్లాండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు.
భారత అండర్-19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, ఎస్‌కే రషీద్, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేష్ బానా, ఆరాధ్య యాదవ్, రాజ్ అంగద్ బావా, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే హంగర్గేకర్, వాసు వాట్స్, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్, జీఏ సంగ్వాన్.
విండీస్ వెళ్తున్న ఆటగాళ్లు: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయి, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్.
ఐర్లాండ్‌తో ఆడిన జట్టు ఇదే: హర్నూర్ సింగ్, రఘువంశీ, రాజ్ అంగద్ బావా, నిశాంత్ సింధు (కెప్టెన్), కౌశల్ తాంబే, దీనేష్ బానా, జీఏ సాంగ్వాన్, ఏఎన్ గౌతమ్, VK ఓస్త్వాల్, RS హంగర్గేకర్, రవి కుమార్