Sania Mirza: ఇండియాను టెన్నీస్ వైపు ట్యూన్ చేసిన టార్చ్‌బేరర్ సానియా!
సింగిల్స్ లో సానియా ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిలూ గెలుచుకోకపోయి ఉండొచ్చు. నిజమే. కానీ... డబుల్స్ లో మాత్రం ఎన్నో రికార్డులు సాధించింది.
ఒక శకం ముగిసింది. End of An Era. ఇది చాలా వెయిట్ ఉన్న ఫ్రేజ్. ప్రతి సందర్భంలోనూ వాడలేం. కానీ ఇవాళ కచ్చితంగా ఈ ఫ్రేజ్ ను మనం ఉపయోగించొచ్చు. ఎందుకంటే నిజంగా భారత టెన్నిస్ లో ఓ శకం ముగిసింది అనుకోవచ్చు. స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా... తన ఆఖరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడేసింది. రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ ఆడిన సానియా మీర్జా..... 6-7, 2-6తో ఓటమి పాలైంది. తన గ్రాండ్ స్లామ్ కెరీర్ ను మిక్స్డ్ డబుల్స్ రన్నరప్ తో ముగించింది. టైటిల్ తో గ్రాండ్ స్లామ్ కెరీర్ ఫినిష్ చేద్దామనుకున్నా అది సాధ్యపడలేదు.
కానీ ఏది ఏమైనా సరే...... సానియా మీర్జా... 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ చూసి కచ్చితంగా గర్వపడొచ్చు. ఆమె గురించి సింపుల్ గా చెప్పాలంటే... ఫేస్ ఆఫ్ ఇండియన్ వుమెన్ టెన్నిస్. ఇప్పటికీ ఇండియాలో మహిళల టెన్నిస్ ప్లేయర్స్ పేర్లు చెప్పమంటే.... కచ్చితంగా అందరూ చెప్పే పేరు సానియా మీర్జా. కానీ ఇంకో పేరు చెప్పమంటే మాత్రం అందరూ తడబడతారు. ఎందుకంటే మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఎవరూ చూపలేకపోయారు కాబట్టి. 2003 లో మొదలైన కెరీర్... వచ్చే నెలలో ముగియబోతోంది. WTA దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ తన ఆఖరి టోర్నమెంట్ అని ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ సానియా కెరీర్ సాగిన తీరు అద్భుతం.
సింగిల్స్ లో సానియా ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిలూ గెలుచుకోకపోయి ఉండొచ్చు. నిజమే. కానీ... డబుల్స్ లో మాత్రం ఎన్నో రికార్డులు సాధించింది. సానియా కెరీర్ 2013కి ముందు ఆ తర్వాత అని సింపుల్ గా చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వరుస గాయాలు తిరగబెడుతుండటంతో... సింగిల్స్ కు గుడ్ బై చెప్పి, డబుల్స్ పై పూర్తిగా దృష్టి పెట్టినప్పటి నుంచి.... సానియా రేంజే మారిపోయింది. డబుల్స్ లో 3, మిక్స్డ్ డబుల్స్ లో 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించింది. 2015లో మార్టినా హింగిస్ తో జోడీ కట్టడం... సానియా కెరీర్ లోనే స్వర్ణ యుగం. ఆ జోరులోనే డబుల్స్ లో నంబర్ వన్ స్థానానికి కూడా సానియా చేరుకుంది. ఆ రోజుల్లో వీరిద్దరి జోడీ.... ప్రతి గ్రాండ్ స్లామ్ లోనూ హాట్ ఫేవరెట్ గా ఉండేది. 2009లో తొలి గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న సానియా... ఆఖరిగా 2016లో మరో గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది.
ఇప్పుడు ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ముగిసిన తర్వాత మాట్లాడిన సానియా మీర్జా.... ఎమోషనల్ అయింది. తాను చాలా చిన్న వయసులోనే కేరీర్ స్టార్ట్ చేశానంటూ చెబుతూ... కంటతడి పెట్టుకున్నారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా తన హోం గ్రౌండ్ లాంటిదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన వారందరి పేర్లు ప్రస్తావించి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో మరుపురాని అనుభూతులు ఇచ్చిన గ్రాండ్‌స్లామ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉందన్నారు.
సో ఓవరాల్ గా చూసుకుంటే... గడిచిన 20 ఏళ్లల్లో టెన్నిస్ అనే ఈ బ్యూటిఫుల్ గేమ్ ను గ్రేస్ చేస్తూ.... ఇండియాలో ఎందరో అమ్మాయిలు టెన్నిస్ వైపు అడుగులు వేసేలా చేయడంలో సానియాది కచ్చితంగా కీలక పాత్ర.