Rahul Dravid Birthday: రాహుల్ ద్రవిడ్‌కు డబ్బంటే చేదా? అతడికా ఉద్దేశం లేదా?
రాహుల్ ద్రవిడ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఏ జట్టుకు కోచింగ్ చేసినా కోట్లలో డబ్బు వస్తుంది. ఎందుకంటే ఆటపై అతడికి అద్భుతమైన పట్టుంది. యువ క్రికెటర్ల మనసును సరిగ్గా అర్థం చేసుకోగలడు. కానీ అతడు డబ్బుకు విలువివ్వడు.
'సార్థక నామధేయులు'.. తెలుగులో ఈ పదానికి ఎంతో విశిష్టమైన అర్థం ఉంది. భారత క్రికెట్లో ఈ విశేషణానికి ముందుగా వినిపించే పేరు 'మిస్టర్ డిపెండబుల్' రాహుల్ ద్రవిడ్! బిరుదుకు తగ్గట్టే టీమ్‌ఇండియా ఇప్పటికీ అతడిపై ఆధారపడుతూనే ఉంది. ఒకప్పుడు క్రికెటర్, కెప్టెన్‌గా దేశ క్రికెట్‌కు నిస్వార్థంగా సేవలందించాడు. మొన్నటి వరకు యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చిన 'వాల్' ఇప్పుడు జాతీయ జట్టుకు కోచ్‌గా మారాడు. నేడు (డిసెంబర్ 11) అతడు 49వ వసంతంలోకి అడుగు పెట్టాడు.
డబ్బంటే చేదా?
రాహుల్ ద్రవిడ్ స్థాయి వ్యక్తి ఫ్రాంచైజీ క్రికెట్లో ఏ జట్టుకు కోచింగ్ చేసినా కోట్లలో డబ్బు చేతికందుతుంది. ఎందుకంటే ఆటపై అతడికి అద్భుతమైన పట్టుంది. యువ క్రికెటర్ల మనసును సరిగ్గా అర్థం చేసుకోగలడు. నొప్పించక తానొవ్వక పద్ధతిలో అన్నీ చక్కబెట్టేస్తాడు. ఆటగాళ్లను సులువుగా కలిసిపోతాడు. అదే సమయంలో హుందాగా ఉంటాడు. వీటన్నిటికీ మించి ద్రవిడ్ తన మనసు, దేశ సేవకు ఎక్కువ విలువిస్తాడు. అందుకే తన సహచరులైన సచిన్, లక్ష్మణ్, కుంబ్లే, గంగూలీ సహా ఇతర సీనియర్లు ఇతర మార్గాల్లో ఆదాయాలు ఆర్జిస్తున్నా అతడు మాత్రం టీమ్‌ఇండియా కోసమే కట్టుబడ్డాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగలొద్దని మిగతా అన్నిటికీ రాజీనామా చేసేశాడు. కోచ్‌గా అతడు రూ.10-12 కోట్ల వరకు తీసుకుంటున్నా కుటుంబంతో గడిపే విలువైన సమయాన్ని త్యాగం చేయడమంటే మాటలు కాదు!
Also Read: ప్రపంచకప్ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!
Also Read: ధోనిని కించపరుస్తూ కేకేఆర్ ట్వీట్.. జడ్డూ దిమ్మదిరిగే రిప్లై.. అది కేవలం షో ఆఫ్ మాత్రమే!
మానసిక దృఢత్వంపై ఎక్కువ దృష్టి
అండర్-19, భారత్-ఏ జట్ల కోచ్‌గా ద్రవిడ్ చెరిపేయలేని ముద్ర వేశాడు. అండర్-19 జట్టును ఒకసారి రన్నరప్ మరోసారి విజేతగా నిలిపాడు. భవిష్యత్ భారత్ కోసం యువ క్రికెటర్లను మెరికలుగా తీర్చిదిద్దాడు. ఇప్పటికీ యువ క్రికెటర్ల ఆటతీరును ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు. చివరి అండర్-19 ప్రపంచకప్‌లో ప్రియమ్‌గార్గ్ జట్టుకూ సలహాలు ఇచ్చాడు. అంతేకాకుండా మైదానంలోకి అడుగుపెట్టే ముందు.. పెట్టాక ఎలాంటి వైఖరితో ఉండాలో.. మానసిక స్థితి ఎలాగుండాలో వీడియో సందేశం ద్వారా వివరించాడు. ఆటగాళ్ల సహజ సిద్ధమైన ఆట, టెక్నిక్‌ను ద్రవిడ్ అస్సలు మార్చడు. మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడంపైనే దృష్టి పెడతాడు. ఎందుకంటే ‘లోపల ఏం భావిస్తామో బయట అదే జరుగుతుంది’ అని నమ్మే వ్యక్తి ఆయన.
స్టార్ కల్చర్‌కు వ్యతిరేకి!
భారత జట్టులో స్టార్ కల్చర్ ఎక్కువ. చాలా కఠినంగా ఉండే మిస్టర్ డిపెండబుల్‌కు ఇది అంతగా నచ్చదు! అతడెంతో స్థితప్రజ్ఞతతో ఉంటాడు. క్రమశిక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చూపినా సహించడు. స్టార్ మనస్తత్వంతో ఏ ఆటగాడైనా తన సూచనలను పెడచెవిన పెడితే అతడు ఊరుకోడు. అందుకే అడిగిన వెంటనే కోచ్ పదవికి ఒప్పుకోలేదు. మొదట అండర్-19, భారత్-ఏకు కోచింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్‌సీయేలో ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. ఇప్పుడు జట్టులో అతడు కోచింగ్‌లో రాటుదేలిన మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్, పృథ్వీ షా, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి క్రికెటర్లు ఉన్నారు. జట్టులో తన మాటకు విలువిచ్చే వారు ఎక్కువగా ఉండటంతో కోచ్‌గా అంగీకరించాడు.
మున్ముందు భారీ సవాళ్లు
ద్రవిడ్ ఆట గురించి మరొకరు చెప్పాల్సిన పనిలేదు. అతడి ఆటేంటో, అతడి బ్యాటింగ్ విలువేంటో అందరికీ తెలుసు. కెరీర్లో 509 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడంటే మామూలు విషయం కాదు. 24,208 పరుగులు, 48 సెంచరీలు కొట్టిన మిస్టర్ వాల్‌ను టీమ్‌ఇండియాలో ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. అతడి ఆదేశాలను ఇప్పుడు ఎవరూ వేలెత్తి చూపే అవకాశమే లేదు. జట్టు కోసం కుటుంబ సమయాన్ని త్యాగం చేసిన అతడి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ పరుగులు చేసేలా చూడాలి. ఐసీసీ టోర్నీల్లో సెమీస్, ఫైనల్లో పొరపాట్లు లేకుండా గెలవడం అలవాటు చేయాలి. అన్నిటికీ మించి ఈ ఏడాది జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాలి.