Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత్ బృందానికి అరుదైన అవకాశం... ఆగస్టు 15 వేడుకలకు స్పెషల్ గెస్ట్‌లుగా పిలిచిన ప్రధాని
టోక్యో ఒలింపిక్స్‌లో పోరాడిన ఆటగాళ్లకు అరుదైన గౌరవం లభించనుంది. ఆగస్టు 15న జరిగే వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొనే ఛాన్స్ వారికి దక్కనుంది.
టోక్యో ఒలింపిక్స్ వెళ్లిన భారత్ బృందానికి ప్రధాని మోదీ అద్భుతమైన అవకాశం కల్పించారు. ఆగస్టు 15న స్పెషల్ గెస్ట్‌లుగా వారిని ఆహ్వానించారు. ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వారందరినీ రిక్వస్ట్ చేశారు భారత్ ప్రధాని నరేంద్రమోదీ. ఆ రోజు అందరితో వ్యక్తిగతంగా సమావేశమై అభినందించనున్నారాయన.
ఈసారి టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం 127 మంది అథ్లెట్స్ వెళ్లారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఆటగాళ్లు పాల్గొనడంపై ప్రధాని అభినందించారు.
అనేక ఈవెంట్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ క్వాలిఫై అయ్యారని... ప్రత్యర్థులకు గట్టి పోటీ కూడా ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుర్తు చేశారు. తమ కన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్న వారితో పోటీ అంత ఈజీ కాదని... మన ప్లేయర్స్ మాత్రం ఎలాంటి బెదురు లేకుండా దీటుగా పోరాడారని... అందుకు వారందర్నీ అభినందించాలన్నారు మోదీ.
ఈసారి భారత్ క్రీడాకారుల్లో అంతా చాలా కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగారని... సరైన ప్రోత్సాహం ఇస్తే భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తారని అభిప్రాయపడ్డారు మోదీ.
ప్రధాని ఆహ్వానంపై మీరాబాయి చాను చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 15లాంటి అతి పెద్ద కార్యక్రమానికి తమను పిలవడం సంతోషంగా ఉందన్నారామె. దేశమంతా ఎంతో ఆనందంగా జరుపుకొనే పండుగకు ఆహ్వానించడమే కాకుండా... ప్రధానితో భోజనం చేసే అవకాశం రావడం కూడా జీవితంలోనే పెద్ద అచీవ్‌మెంట్ అంటున్నారు మీరాబాయి చాను.
కాంస్యం పతకం ఇండియాకు తిరిగి వచ్చిన సింధు బృందానికి డిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. అభిమానులు, స్పోర్ట్స్ అథారిటీ సింధు, ఆమె కోచ్ పార్క్‌గు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్పోర్ట్స్ అథారిటీకి తీసుకెళ్లి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి సింధు థ్యాంక్స్ చెప్పారు. ఎప్పుడు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చిందన్నారు. దేశంలో తనను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు సింధు. తన కోసం ఎంతో శ్రమించిన పేరెంట్స్‌కి కూడా ఆమె కృతజ్ఞత తెలిపారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అభిమానులు, మీడియా తమను గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడంపై చాలా ఆనందం వ్యక్తం చేశారు సింధు కోచ్ పార్క్ . గతంలో ఎప్పుడూ ఇలాంటి స్వాగతాలు అందుకోలేదన్నారు. తనను ట్రైనర్‌గా ఎంచుకున్నందుకు సింధుకు, ఆమె పేరెంట్స్‌కు థ్యాంక్స్ చెప్పారాయన.
135 కోట్ల మంది మొహాల్లో నవ్వులు పూయించారన్నారు అనురాగ్ ఠాకూర్. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా యూత్ ఐకాన్స్ అని... ఎందరికో స్పూర్తిని ఇచ్చారని కితాబిచ్చారు.
ఈ పతకం పూర్తిగా సింధు శ్రమకు దక్కిన గౌరవమని... ఈ ఘనత ఆమెకు, ఆమె ఫ్యామిలీ, కోచ్, ఫిజియోకు చెందుతుందన్నారు మరో మంత్రి నిర్మలాసీతారామన్.
మరోవైపు పారా ఒలింపిక్స్ 2020 కోసం ప్రత్యేక థీమ్ సాంగ్ విడుదల చేశారు స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్. ఇది కూడా చాలా ఆనందాన్నిచ్చిన సంఘటనని అభిప్రాయపడ్డారాయన. వాళ్లు కూడా అద్భుతంగా రాణించి దేశ ఖ్యాతి పెంచాలని అభిప్రాయపడ్డారు.