Lata Mangeshkar: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!
భారత క్రికెట్ జట్టుకు సింగర్ లతా మంగేష్కర్ చేసిన ఓ పెద్ద సాయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ గుర్తు చేసుకున్నారు. సచిన్ ఆడే మ్యాచ్‌లను ఆమె ఎక్కువగా వీక్షించేవారని తెలిసిందే.
![Lata Mangeshkar: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా! Lata Mangeshkar Raised money for Team Indias 1983 World Cup winners Lata Mangeshkar: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/6e810c9451210619fc014b276baaa1ea_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lata Mangeshkar Raised money for 1983 World Cup winners: గాన కోకిల లతా మంగేష్కర్‌కు చాలా ఇష్టమైన క్రీడ క్రికెట్. ఈ విషయాన్ని పలువురు క్రికెటర్లు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ భారత క్రికెట్ జట్టుకు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చేసిన ఓ పెద్ద సాయాన్ని ఆమె మరణించిన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ గుర్తు చేసుకున్నారు.
1983లో ఏ అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ వెళ్లి ఫైనల్లో వెస్టిండీస్ లాంటి పటిష్ట జట్టును ఓడించింది. తొలిసారి సగర్వంగా వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడింది. కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ఈ అద్భుతం చేయగా.. ఇప్పటికీ దేశంలో అదో మరపురాని విషయంగా చూస్తారు. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన వారిలో క్రేజీ ఫ్యాన్ లతాజీ కూడా ఉన్నారు. భారత జట్టును అభినందించేందుకు లతా దీదీ లార్డ్స్‌కు వచ్చారని.. టీమ్ మొత్తం ఆమెను చూసి ఆశ్చర్యపోయిందని తెలిపారు.
అసలు సమస్య ఏంటంటే..
వన్డే వరల్డ్ కప్ నెగ్గి సగర్వంగా దేశానికి తిరిగి వచ్చింది టీమిండియా. ప్రపంచ కప్ నెగ్గిన జట్టులో ప్రతి ఆటగాడికి రూ.25,000 నజరానా ప్రకటించింది బీసీసీఐ. కానీ ఆర్థిక సమస్యలతో ఉన్న బోర్డు వద్ద ఆటగాళ్లకు ఇచ్చేందుకు డబ్బు లేదు. దీంతో బీసీసీఐ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సాయాన్ని కోరగా, క్రికెట్ ప్రేమికురాలైన ఆమె పెద్ద మనసుతో ముందుకొచ్చారు. న్యూఢిల్లీలో కచేరీ నిర్వహించి నిధులు సేకరించగా రూ.20 లక్షల వరకు వసూలైంది. ఆ రోజుల్లో అన్ని రూపాయలంటే అంటే చాలా పెద్ద మొత్తం మరి. ఆ డబ్బును బీసీసీఐకి లతా మంగేష్కర్ ఇవ్వగా.. బీసీసీఐ ముందుగా ప్రకటించినట్లుగా రూ.25 వేలకు బదులుగా రూ.1 లక్ష రూపాయాలు బహూకరించింది. లతా దీదీ సహాయం చేయకపోతే బీసీసీఐకి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉందని ఆనాటి రోజులను తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
ఇంగ్లాండ్ లార్డ్స్ క్రికెట్ స్టేడియం సమీపంలో లతా మంగేష్కర్‌కు ఇల్లు ఉంది. 1986లో అదే వేదికగా మూడో శతకం బాదిన తరువాత తనతో పాటు నలుగురు ఆటగాళ్లను లంచ్‌కు ఆహ్వానించారని వెంగ్‌సర్కార్ తెలిపారు. లతా మంగేష్కర్ వంట చాలా బాగా చేస్తారు. కోల్హాపురి స్టైల్ మటన్, గజర్ హల్వా చేయగా టీమిండియా ఆటగాళ్లు ఆమె ఇచ్చిన విందుకు ఫిదా అయిపోయారు. టెస్టు క్రికెట్‌ను ఆమె ఆస్వాదించేవారని, మ్యాచ్‌లు వీక్షించేందుకు ముంబై స్టేడియాలకు తరచుగా వచ్చేవారని, చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బయటకు అంతగా రాలేదని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు. సచిన్ ఆడే మ్యాచ్‌లను ఆమె ఎక్కువగా వీక్షించేవారని తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)