(Source: ECI/ABP News/ABP Majha)
Kelvin Kiptum Death : రోడ్డు ప్రమాదంలో కెన్యా మారథాన్ ప్రపంచ విజేత కెల్విన్ మృతి
Kelvin Kiptum: మారథాన్ ప్రపంచ రికార్డ్ విజేత కెల్విన్ కిప్తమ్ కెన్యాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మరణించారు. కిప్తమ్తో పాటు ఆయన కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా ప్రాణాలు కోల్పోయారు.
kelvin kiptum dies in road accident : కెన్యా(Kenya)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ ప్రముఖ క్రీడాకారుడిని బలి తీసుకుంది. కెన్యాకు చెందిన యువ మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్(Kelvin Kiptum) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అతడితో పాటు అతని కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా మృతి చెందారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మరో క్రీడాకారుడు మిల్కా చెమోస్ ధ్రువీకరించారు. ఈ ప్రమాదం పశ్చిమ కెన్యాలోని ఎల్డోరెట్-కప్తగట్ పట్టణాల మధ్య రహదారిపై జరిగింది.
కెన్యాలోని కప్తగట్ నుంచి ఎల్డోరెట్‌కు కెల్విన్ తో పాటూ మరో ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. వారిలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ కమాండర్ పీటర్ ములింగే తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కిప్టుమ్ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తున్నారని , అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిందని చెప్పారు.
యంగ్ సూపర్ స్టార్
24ఏళ్ల వయసున్న కిప్తమ్ గతేడాది అక్టోబర్‌లోనే మారథాన్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. షికాగోలో జరిగిన ఆ పోటీల్లో 2 గంటల 35 సెకన్లతో వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కెన్యాకే చెందిన ఎలియడ్ కిప్చోగే పేరిట ఉన్న రికార్డును 34 సెకన్ల ముందే అధిగమించి సత్తా చాటారు. ఈ రికార్డును గత వారమే అంతర్జాతీయ ట్రాక్ ఫెడరేషన్ వరల్డ్ అథ్లెటిక్స్ ధ్రువీకరించింది. 2022లో వాలెన్సియాలో జరిగిన మారథాన్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక లండన్, చికాగో రేసులను గెలుచుకున్నారు. ఇక 2023 అక్టోబరులో జరిగిన మారథాన్‌లో మరో అరుదైన రికార్డు అందుతున్నాడు. మూడో పోటీలోనే ఈ ఘనత సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్‌లోనూ కెల్విన్ హాట్ ఫేవరెట్. కిప్టుమ్ ఒక మంచి అథ్లెట్ మాత్రమే కాదు.. పారిస్ ఒలింపిక్స్‌కు స్పష్టమైన పోటీదారు కూడా..!కిప్టమ్ ఇద్దరు పిల్లల తండ్రి. 2022లో తన మొదటి పూర్తి మారథాన్ లో పాల్గొన్న తరువాత అతని కీర్తి చాలా వేగంగాపెరుగుతూ వచ్చింది. మొట్ట మొదటి ప్రధాన పోటీలో పాల్గొనే సమయంలో ఒక జత బూట్లను కూడా కొనలేని పేదరికంలో ఉన్నాడు. ఆ సమయంలో బూట్లు అరువు తెచ్చుకుని పోటీకి దిగారు.
కిప్టమ్ కోచ్, హకిజిమానా రిటైర్డ్ రువాండిస్ రన్నర్. కిప్టమ్ ప్రపంచ రికార్డును పొందదం కోసం నెలల తరబడి అతనికి శిక్షణ ఇచ్చాడు. కోచ్, అథ్లెట్ లుగా వారి అనుబంధం 2018లో ప్రారంభమైంది.
ప్రముఖుల సంతాపం
కెల్విన్ కిప్తమ్ మరణం పట్ల పలువురు క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.కెల్విన్ లేని లోటును వివరించడానికి తన వద్ద మాటలు లేవు అంటూ.. కెన్యా అథ్లెట్ మిల్కా కెమోస్ విచారాన్ని వ్యక్తం చేశారు. కెన్యా క్రీడా మంత్రి అబాబు నమ్వాంబా కెల్విన్ కిప్తమ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. 'కెన్యా ఓ జాతి రత్నాన్ని కోల్పోయింది. ఇది విచారకరం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు' అని ట్విట్ చేశారు. కెన్యా ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని రైలా ఒడింగా కూడా దేశం "నిజమైన హీరో"ని కోల్పోయింది. "కెన్యా అథ్లెటిక్స్ ఐకాన్" కిప్టమ్ అని సంతాపం వ్యక్తం చేశారు. కెల్విన్ మరణవార్త తెలుసుకుంటున్న అతని అభిమానులు, శ్రేయోభిలాషులు గొప్ప అథ్లెట్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేస్తున్నారు.