Women IPL 2023: బీసీసీఐకి మళ్లీ డబ్బే డబ్బు! WIPL మీడియా హక్కులకు పెరిగిన క్రేజ్
Women IPL 2023: మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది. వచ్చే ఏడాది నిర్వహించే మహిళల ఐపీఎల్ (WIPL) మీడియా హక్కులకు మంచి స్పందన లభించింది.
Women IPL 2023:
మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది. వచ్చే ఏడాది నిర్వహించే మహిళల ఐపీఎల్ (WIPL) మీడియా హక్కులకు మంచి స్పందన లభించింది. పదికి పైగా కంపెనీలు టెండర్ పత్రాలను తీసుకున్నాయని తెలిసింది. డిస్నీ స్టార్, సోనీ నెట్‌వర్క్, వయాకామ్ 18తో పాటు అమెజాన్ ప్రైమ్, ఫ్యాన్ కోడ్, టైమ్స్ ఇంటర్నెట్, గూగుల్, డిస్కవరీ పోటీ పడుతున్నాయి. టెండర్ పత్రాలు సమర్పించేందుకు జనవరి 12 చివరి తేదీ. మార్చి 3 నుంచి 26 వరకు టోర్నీ జరగనుందని అంచనా.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు బీసీసీఐ కనీస ధర నిర్ణయించలేదు. మీడియా హక్కుల వ్యవహారం పూర్తయ్యాక ఫ్రాంచైజీలను విక్రయించనుంది. ప్రసార హక్కుల విలువను బట్టి ఆదాయంపై ఫ్రాంచైజీలు అంచనాకు రానున్నాయి. 'మీడియా హక్కుల వ్యవహారం పూర్తవ్వగానే ఫ్రాంచైజీ హక్కుల టెండర్లను ఆహ్వానిస్తాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మహిళల ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజీ రూ.1000 కోట్లకు పైగా ఆదాయం సృష్టిస్తాయని అంచనా వేశారు.
'ఇదో కొత్త ప్రొడక్ట్. కానీ ఇంతకు ముందు తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా అమ్మాయిల సిరీసుకు వచ్చిన స్పందన గమనించండి. మహిళల క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని దీన్నిబట్టి తెలుస్తోంది. ప్రతి ఫ్రాంచైజీ రూ.1000 కోట్లకు పైగా ఆదాయం అందిస్తుందని మా అంచనా. వేలంలో మహిళా క్రికెటర్లకూ మంచి ధర లభించనుంది. ప్రతి ఫ్రాంచైజీ ప్లేయర్ పర్స్ రూ.35-40 కోట్లు ఉంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లుగా నిర్ణయిస్తారని తెలిసింది. మహిళల ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ రెండు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. జోన్ల ఆధారంగా జట్లను విక్రయించి ఐపీఎల్ యేతర మైదానాల్లో మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం. మొత్తంగా ఐదు ఫ్రాంచైజీల ద్వారా రూ.6000 నుంచి రూ.8000 కోట్ల వరకు డబ్బు వస్తుందని బోర్డు అంచనా వేస్తోంది.
View this post on Instagram