SRH vs RCB: కేన్ మామా, కోహ్లీ భయ్యా! ఫెయిల్యూర్‌లోనూ ఈ బ్రొమాన్స్ ఏంది బ్రో!
SRH vs RCB: ఐపీఎల్ 2022లో SRH, RCB మళ్లీ తలపడుతున్నాయి. పడుతూ లేస్తూ సాగుతున్న ఈ జట్లకు ఇద్దరి ఫామ్ ఇబ్బందికరంగా మారింది. వారే విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్!
virat kohli kane williamson worst strike rate for a batter in IPL 2022 min 150 balls faced : ఐపీఎల్ 2022లో అత్యంత కీలకమైన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. వాంఖడేలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న ఈ రెండు జట్లకు ఇద్దరి ఫామ్ ఇబ్బందికరంగా మారింది. వారే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్!
మంచి ఫ్రెండ్స్
అంతర్జాతీయ క్రికెట్లో కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ మంచి ఫ్రెండ్స్! ఒకరు దూకుడుకు మారుపేరైతే మరొకరు ప్రశాంతతకు చిరునామా. పరుగుల వరద పారించడంలో వీరి శైలి మాత్రమే భిన్నం కానీ విధ్వంసం మాత్రం ఒక్కటే. అండర్ 19 క్రికెట్ నుంచీ వీరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. బ్యాటింగ్‌కు దిగితే వికెట్ ఇవ్వకుండా దంచికొట్టే వీరిద్దరూ కొన్నాళ్లుగా ఫామ్‌లో లేరు. రెండేళ్లుగా విలువైన పరుగులే చేస్తున్నా మునుపటి దూకుడు విరాట్‌లో కనిపించడం లేదు. గాయపడ్డ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన కేన్ మామ ఈ సీజన్లో అసలు ఆడుతున్నట్టే కనిపించడం లేదు. అందుకే రఫ్ ప్యాచ్‌లోనూ వీరిద్దరూ బ్రొమాన్స్ కంటిన్యూ చేస్తున్నట్టు అనిపిస్తోంది.
ఘోరమైన రన్‌రేట్ వీరిద్దరిదే
కేన్ విలియమ్సన్ ఈ సీజన్లో పది మ్యాచులు ఆడితే చేసింది 199 పరుగులే. స్ట్రైక్‌రేట్ 96.13గా ఉంది. ఈ సీజన్లో కనీసం 150 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లలో ఇదే ఘోరమైన ప్రదర్శన కావడం గమానర్హం. 207 బంతులు ఎదుర్కొన్న కేన్ మామ సగటు 22.11గా ఉంది. ఒకసారి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 119 స్ట్రైక్‌రేట్‌తో 216 పరుగులు చేశాడు. సగటు 21.60గా ఉంది. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. రెండుసార్లు డకౌట్ అయ్యాడు. మరి ఆదివారం జరిగే మ్యాచులో వీరిద్దరూ ఎలా ఆడతారో చూడాలి.
సన్‌రైజర్స్‌దే పైచేయి
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. 11 మ్యాచుల్లో 6 గెలిచి 5 ఓడి 12 పాయింట్లు అందుకుంది. నెగెటివ్ రన్‌రేట్ ఉండటం కలవరపరిచే అంశం. ఈ మ్యాచులో గెలిస్తే 14 పాయింట్లతో ఇంకా పటిష్ఠంగా మారిపోతారు. మరోవైపు సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో 5 గెలిచి 5 ఓడింది. 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ పోరులో గెలిస్తే మళ్లీ టాప్-4లో నిలుస్తుంది. ప్లేఆఫ్స్ అవకాశాలను ఒడిసిపడుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 9-11తో ఆర్సీబీ వెనకబడింది.
SRH vs RCB Probable XI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోస్ హేజిల్‌వుడ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్ / సేన్ అబాట్, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్