Womens IPL Media Rights: విమెన్స్ ఐపీఎల్ - ఒక్కో మ్యాచుకు రూ.7 కోట్లు ఇస్తున్న వయాకామ్!
Womens IPL Media Rights: మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం పూర్తైంది. రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.
Womens IPL Media Rights:
మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం పూర్తైంది. రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.951 కోట్లు చెల్లిస్తోంది. అంటే 2023 నుంచి 27 మధ్య జరిగే ప్రతి మ్యాచుకూ రూ.7.09 కోట్లు ఇస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా మీడియా హక్కుల వివరాలను వెల్లడించారు.
Congratulations @viacom18 for winning the Women’s @IPL media rights. Thank you for your faith in @BCCI and @BCCIWomen. Viacom has committed INR 951 crores which means per match value of INR 7.09 crores for next 5 years (2023-27). This is massive for Women’s Cricket 🙏🇮🇳
— Jay Shah (@JayShah) January 16, 2023
'మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల విజేత వయాకామ్ 18ను అభినందనలు. పురుషుల, మహిళల క్రికెట్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. రాబోయే ఐదేళ్లకు వయాకామ్ రూ.951 కోట్లను చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచు విలువ రూ.7.09 కోట్లు. మహిళల క్రికెట్‌కు ఇదో గొప్ప విజయం' అని జే షా ట్వీట్ చేశారు.
'సమాన వేతనాల తర్వాత మహిళల క్రికెట్ సాధించిన మరో గొప్ప విజయం మీడియా హక్కుల బిడ్డింగ్. దేశంలో మహిళా క్రికెట్ సాధికారతకు ఇదో గొప్ప ముందడుగు. అన్ని వయసుల్లోని అమ్మాయిలు లీగులో పాల్గొనేందుకు ఇది ప్రేరణ కల్పించనుంది. ఇది సరికొత్త సూర్యోదయం' అని ఐసీసీ, బీసీసీఐ మహిళలను జే షా ట్యాగ్ చేశారు.
After pay equity, today's bidding for media rights for Women's IPL marks another historic mandate. It's a big and decisive step for empowerment of women's cricket in India, which will ensure participation of women from all ages. A new dawn indeed! #WIPL @ICC @BCCIWomen
— Jay Shah (@JayShah) January 16, 2023
దేశంలో క్రికెట్ ప్రసార హక్కులను కొనుగోలు చేయడంలో వయాకామ్ 18 దూకుడు ప్రదర్శిస్తోంది. తన మాతృసంస్థ రిలయన్స్ అండతో అన్ని క్రీడల హక్కులను కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో పురుషుల ఐపీఎల్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మధ్యే ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నూ జియో సినిమాలో ప్రసారం చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్‌ఏ20 లీగునూ అందిస్తోంది. పురుషుల ఐపీఎల్‌నూ 4K క్వాలిటీలో 11 భాషాల్లో ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
మహిళా క్రికెటర్ల కనీస ధరలనూ నిర్ణయించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఐదు విభాగాలుగా విభజించారని సమాచారం. అమ్మాయిలు వేలంలో పేర్లు నమోదు చేసుకొనేందుకు జనవరి 26 చివరి తేదీ. ఈమేరకు బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు మార్గదర్శకాలు పంపించింది.
ఇప్పటికే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన అమ్మాయిలు, సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఉన్నవారు రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల కనీస ధరల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అరంగేట్రం చేయని క్రికెటర్లు రూ.10 లక్షలు, రూ.20 లక్షల విభాగాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. మహిళల ఐపీఎల్‌లో స్థానిక క్రికెటర్లు ఎక్కువ పాల్గొనేలా చూడాలని రాష్ట్ర సంఘాలను బీసీసీఐ ఆదేశించింది. విదేశీ క్రికెటర్లకూ ఈ ఐదు విభాగాలే ఉంటాయని తెలిపింది.
మహిళల ఐపీఎల్ క్రికెటర్ల వేలం తేదీని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. ఫిబ్రవరి 11న వేలం ఉంటుందని తెలిసింది. మార్చి 6 నుంచి 26 వరకు మహారాష్ట్రలోని వేదికల్లో మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం. వేలంలో నమోదు చేసుకొనే క్రికెటర్లు తమ వ్యక్తిగత స్పాన్సర్లను ధ్రువీకరించాల్సి ఉంటుంది. వేలంలో క్రికెటర్ల ఏజెంట్ల జోక్యాన్ని బీసీసీఐ నిరాకరించింది.