IPL 2025: RCB శిబిరంలో టెన్షన్ టెన్షన్! క్వాలిఫయర్ 2లో ముంబై రికార్డులు అలా ఉన్నాయి
IPL 2025 PBKS vs MI | ఐపీఎల్ 2011లో క్వాలిఫయర్ 2 మొదలుపెట్టినప్పటి నుంచి అందులో నెగ్గి, IPL కప్ గెలిచిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే.

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 దాదాపుగా క్లైమాక్స్‌కు చేరుకుంది. కేవలం రెండు మ్యాచ్ లు పూర్తయితే ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోతుంది. అయితే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat)పై ఘన విజయం సాధించి, IPL 2025 క్వాలిఫైయర్ 2లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ నెగ్గాలని ఆర్సీబీ జట్టు కోరుకుంటోంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న ఐపీఎల్ రికార్డు ఆర్సీబీ జట్టును, వారి అభిమానులకు ఆందోళనకు గురిచేస్తోంది.
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరాలంటే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడి విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే, ముంబై జట్టుకు సంబంధించిన ఓ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో ఆందోళనను రేకెత్తిస్తోంది. అందుకు బలమైన కారణం ఉంది.
ముంబైకి మాత్రమే సాధ్యమైన రికార్డు
2011లో ప్లేఆఫ్ ఫార్మాట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుండి, క్వాలిఫైయర్ 2 ద్వారా ఫైనల్ చేరి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. అది కూడా రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై టీమ్ ఈ అరుదైన ఘనతను మూడుసార్లు సాధించడం ఆర్సీబీని టెన్షన్ పెడుతోంది. దాంతో నేటి క్వాలిఫయర్ 2 మ్యాచులో పంజాబ్ చేతిలో ముంబై ఓడిపోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
2013 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (MI) మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిపోయింది. కానీ క్వాలిఫైయర్ 2లో గెలిచి తిరిగి రేసులోకి వచ్చిన ముంబై జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అది కూడా ఫైనల్‌లో పటిష్టమైన ఎం.ఎస్. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం అంటే ఆషామాషీ కాదు. మరోవైపు చెన్నై అదివరకే 2 టైటిల్స్ నెగ్గింది.
2017లో ముంబై మరోసారి అదే సీన్ రిపీట్ చేసింది. ఆ ఏడాది క్వాలిఫైయర్ 1లో ఓటమి చెందింది, క్వాలిఫైయర్ 2లో విజయం సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి తమ మూడవ ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది ముంబై జట్టు.
క్వాలిఫైయర్ 2లో ముంబై రికార్డు..
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో ఆడటం నేటి మ్యాచ్‌తో కలిపితే ఇది నాలుగవ సారి. 2019లో ఫైనల్‌కు చేరుకున్న ముంబై టైటిల్ పోరులో ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి నాలుగో టైటిల్ నెగ్గింది.
ఆర్సీబీలో టెన్షన్..
ముంబై ఇండియన్స్ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ నెగ్గిన జట్టు ఫైనల్లో ఆర్‌సీబీని ఢీకొడుతుంది. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ ను ఓడించి ఆర్సీబీ ఇదివరకే ఫైనల్ చేరి తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. నేటి మ్యాచ్ ఫలితం కోసం ఆర్సీబీ సైతం ఆసక్తిగా చూస్తోంది. గతంలో ముంబై క్వాలిఫయర్ 2 ద్వారా విజయాలు సాధించి ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ఏకైక జట్టు కావడం ఆర్సీబీని ఆందోలనకు గురిచేస్తోంది.





















