IPL 2025 MI VS DC Updates : ముంబై, ఢిల్లీ మ్యాచ్ కు వర్షం ముప్పు..! ఈ మ్యాచ్ తో ప్లే ఆఫ్స్ పై స్పష్టత.. నాకౌట్ బెర్త్ పై ఇరుజట్ల కన్ను
ఈనెల 21న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలకమైన లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా ప్లే ఆఫ్ రేసుపై మరింత స్పష్టత రానుంది. అయితే ఈ మ్యాచ్ కు వరణుడు అడ్డు పడే అవకాశముంది.

IPL 2025 Play Off Race Scenario:ప్లే ఆఫ్ రేసులో మిగిలిన రెండు జట్లు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ నిర్వహణపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. వర్షం అడ్డుపడే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ జరిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బుధవారం నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం నగరంలో వర్షం పడటంతో ఇరుజట్ల ట్రైనింగ్ సెషన్ కూడా కుదించబడింది. నిజానికి సాయత్రం 6 నుంచి 9 వరకు ట్రైనింగ్ సెషన్ జరగాల్సి ఉండగా, వర్షం పడటంతో ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తొలుత ముంబై ప్లేయర్లు వెళ్లిపోగా, ఢిల్లీ ఆటగాళ్లు మాత్రం కాసేపు వేచి చూశారు.
ఇరుజట్లకు కీలకం..
ఈ మ్యాచ్ లో ఫలితం ద్వారా ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టే నాలుగో జట్టేదో తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే, ఎలాంటి సమీకరణం అవసరం లేకుండా నాకౌట్ కు చేరుతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఒక్క విజయం సాధిస్తే చాలు, 16 పాయింట్లతో ముందంజ వేస్తుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు చేరతాయి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవం అవుతాయి. ఈనెల 24న పంజాబ్ తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే, నేరుగా నాకౌట్ కు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
పొడగించిన సమయం..
నిజానికి ప్లే ఆఫ్ మ్యాచ్ ల్లో నిర్ణీత సమయం కంటే ఒక గంట అదనంగా మ్యాచ్ నిర్వహణ కోసం కేటాయిస్తారు. అనుకోని అవాంతరాల వల్ల మ్యాచ్ జరగడం లేటయితే ఈ సమయం పనికొస్తుంది. అయితే ఈ ఏడాది నెలకొన్న అనూహ్య పరిస్థితుల వల్ల ఈనెల 21 నుంచి జరిగే మ్యాచ్ లు నిర్ణీత సమయం కంటే మరో గంట పాటు అదనంగా కేటాయించినట్లు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం. అంటే వర్షం వల్ల ఒకవేళ ఆట మొదలు కావడం లేటయితే, ఎదురు చూసే కటాఫ్ టైమ్ ను తాజాగా మరో గంటకు కేటాయిస్తారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ప్లే ఆప్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఢిల్లీ, ముంబై జట్లు నువ్వా నేనా అని ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం ఐదుసార్లు చాంపియన్ ముంబై వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ జట్టుకే నాకౌట్ అవకాశాలు ఉన్నాయిని పేర్కొంటున్నారు.




















