CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచాక ధోని బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నాడు. ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఐపీఎల్ 2023 ఫైనల్స్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో సీఎస్కే టాస్ గెలిచిన అనంతరం అది బ్యాటింగ్ ట్రాక్ అయినా, బౌలింగ్ ట్రాక్ అయినా మొదట బ్యాటింగ్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేది. క్వాలిఫయర్-1తో సహా గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచాక బ్యాటింగే తీసుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఛేజింగ్‌కు ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు.
వర్షమే ప్రధాన కారణమా?
ప్రస్తుతం మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. అసలు ఫైనల్స్ ఆదివారమే జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డేకి మారింది. ఈరోజు (సోమవారం) కూడా మ్యాచ్ మీద వర్షం ప్రభావం లేకపోలేదు. ఒకవేళ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేవారికి అది ఎంతో ప్లస్ కానుంది. ఎన్ని ఓవర్లకు ఎంత కొట్టాలి? ఎంత వేగంతో ఆడాలి? ఇలా ప్రతి అంశంపైనా ఒక క్లారిటీతో ఆడవచ్చు. అందుకే టాస్ గెలవగానే ధోని మరో ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకున్నాడు.
అంతే కాకుండా మ్యాచ్ మీద డ్యూ ఎఫెక్ట్ కూడా ఉండవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి త్వరగా తడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు బంతి మీద గ్రిప్ దొరకదు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను నమ్ముకున్న గుజరాత్ టైటాన్స్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు.
టాస్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని కూడా వర్షం ముప్పు ఇంకా ఉంది కాబట్టే బౌలింగ్ ఎంచుకుంటున్నట్లు తెలిపాడు. ‘నిన్నంతా డ్రెస్సింగ్ రూంలోనే గడిపాం. ఒక క్రికెటర్ ఎప్పుడూ గ్రౌండ్‌లో ఆడాలి అనుకుంటాడు. కానీ నిన్నటి వర్షంతో అందరి కంటే జనం ఎక్కువ ఇబ్బంది పడ్డారు. వారిని ఎంటర్‌టైన్ చేయాలి అనుకుంటున్నాం. పిచ్‌ని ఎక్కువ సేపు కప్పి ఉంచారు. కానీ సీజన్ అంతా ఈ పిచ్ ఒకేలా స్పందించింది. ఇలాంటి టోర్నమెంట్‌కు న్యాయం జరగడం చాలా ముఖ్యం. పూర్తి 20 ఓవర్ల ఆటతోనే అది సాధ్యం అవుతుంది.’ అన్నాడు.
అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘మేం కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ నా మనసు మొదట బ్యాటింగే అంటూ ఉంది. కాబట్టి టాస్ మా మీద ఎక్కువ ప్రభావం చూపదు. మన చేతిలో లేని దాని (వాతావరణం) గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఏ జట్టు బాగా ఆడితే వారికే ట్రోఫీ సొంతం అవుతుంది. నేను కుర్రాళ్ల మీద ఒత్తిడి పెంచను. అప్పుడే వారు బాగా ఆడగలరు. ఇది ఒక ఫ్లాట్ ట్రాక్.’ అన్నాడు.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జాషువా లిటిల్, కేఎస్ భరత్, ఒడియన్ స్మిత్, సాయి కిషోర్, శివం మావి
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
శివం దూబే, మిషెల్ శాంట్నర్, సుభ్రాంషు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్