MI Vs PBKS: చివరి 30 బంతుల్లో 96 కొట్టేసిన పంజాబ్ - ముంబై ముందు బిగ్ టార్గెట్!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
Punjab Kings vs Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్‌లో నేడు (శనివారం) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్ శామ్ కరన్ (55: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శామ్ కరన్‌కు హర్‌ప్రీత్ సింగ్ భాటియా (41: 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. చివర్లో జితేష్ శర్మ (25: 7 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 96 పరుగులు చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఓపెనర్ మాథ్యూ షార్ట్ విఫలం అయ్యాడు. కానీ ప్రభ్‌సిమ్రన్ సింగ్, అధర్వ తైడే వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరితో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా కాస్త వ్యవధిలోనే అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 83 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయింది.
అయితే శామ్ కరన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా పంజాబ్‌ను ముందుకు నడిపించారు. మొదట వీరు కొంచెం నిదానంగా ఆడారు. శామ్ కరన్ మొదటి 10 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. కానీ మెల్లగా గేర్లు మార్చారు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగారు. అర్జున్ టెండూల్కర్ వేసిన ఒక ఓవర్లో 31 పరుగులు రాబట్టారు. వీరు అవుటయ్యాక వచ్చిన జితేష్ శర్మ కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లో పీయూష్ చావ్లా, కామెరాన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్, బెహ్రెండాఫ్, అర్జున్ టెండూల్కర్‌లకు తలో వికెట్ దక్కింది.
Innings break!@PunjabKingsIPL post a mighty first-innings total of 214/8 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 22, 2023
A huge chase coming up for @mipaltan! Can they emerge victorious tonight? We will find out soon 🙌
Scorecard ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/F5WBsvURgC
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కరన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, సికందర్ రజా, రిషి ధావన్, గుర్నూర్ బ్రార్
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రమణదీప్ సింగ్, కుమార్ కార్తికేయ, శామ్స్ ములానీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా