KKR vs SRH, IPL 2024: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఏం తీసుకుందంటే ?
KKR vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొలి పోరుకు హైదరాబాద్ సిద్ధమైంది. కోల్‌కతాతో సమరానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైద్రాబాద్(SRH) ఫీల్డింగ్ ఎంచుకుంది.
KKR vs SRH, SRH chose to field : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో తొలి పోరుకు హైదరాబాద్ సిద్ధమైంది. కోల్‌కతా(KKR)తో సమరానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైద్రాబాద్(SRH) ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో టైటిల్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. గత ఏడాది సంతృప్తికర ఫలితాలతో కోల్‌కతా ఆత్మవిశ్వాసంగానే ఉంది. ఈసారి కొత్త కెప్టెన్, భారీ హిట్టర్లు ఉండడంతో హైదరాబాద్ కూడా అంతే ధీమాగా ఉంది. అయితే టైటిల్ గెలిచి ఏళ్లు గడవడం, ప్రతీ ఏడాది కప్ ఆశలతో టోర్నీలోఅడుగుపెట్టడం... తర్వాత రిక్త హస్తాలతో వెనుదిరిగడం ఈ జట్లకు అలవాటుగా మారింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరూ విజయం సాధిస్తారో వేచిచూడాలి.
హైదరా"బాద్‌షా"
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సారి బలంగా కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బౌలింగ్‌ని నమ్ముకొన్న టీం ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. మరోసారి ఈ జట్టు బౌలింగ్ విభాగం బలీయంగా ఉంది. ఈ సారి వేలంలో 20.50 కోట్లు పెట్టి కొన్న పాట్‌కమిన్స్ కెప్టెన్ కమ్ ప్రధాన బౌలర్‌గా ఉండటం హైదరాబాద్ కి లాభించేదే. మరోవైపు భువనేశ్వర్, నటరాజన్, ఉనాద్కత్, మార్కో జన్‌సేన్, ఉమ్రాన్‌మాలిక్ లతో పేస్ బౌలింగ్ బలంగా ఉంది. ఇక బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి, అగర్వాల్, మార్‌క్రమ్, ట్రావిస్‌హెడ్, సమద్,హెన్రిచ్‌క్లాసెన్, అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్ ఉండడంతో రైజర్స్ ఈసారి టోర్నీపై భారీ ఆశలు పెట్టుకొంది.
కోల్"కథేంటి"
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో మనీష్‌పాండే, శ్రేయస్ అయ్యర్, ఫిలిప్‌సాల్ట్, నితీష్‌రాణా, రూథర్‌ఫోర్డ్, వెంకటేశ్ అయ్యర్,ఫినిషర్ గా రింకూసింగ్ ఉండగా, మరో విధ్వంసం రస్సెల్ కూడా జత కలిస్తుండటంతో కొండంత లక్ష్యాలు కూడా చిన్నబోవాల్సిందే. ఇక బౌలింగ్ విషయంలో 24.75 కోట్లతో కొనుక్కొన్నమిచెల్ స్టార్క్ ప్రధాన ఆయుధం. చమీరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు బౌలింగ్ దళాన్నినడపనున్నారు. మధ్యలో రసెల్, వెంకటేశ్ లు కొన్ని ఓవర్లు పంచుకోనున్నారు. వీరితో ప్రత్యర్ధి భరతం పట్టడానికి కెప్టెన్ శ్రేయస్ వ్యూహాలు రచిస్తాడు.
రికార్డ్ అటువైపే
ఇరుజట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా కోల్‌కతా 16 మ్యాచ్‌లు గెలుపొందగా, సన్‌రైజర్స్ కేవలం 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత 2023 సీజన్‌లో చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇక సొంత మైదానమైన రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రికార్డ్ చూస్తే ఈ మైదానంలో రికార్డ్ కోలకతాకు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరిగితే అందులో హైద్రాబాద్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందితే, కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక కోల్‌కతా సొంత మైదానమైన ఈడెన్‌గార్డెన్స్‌లో ఇరుజట్లు 9 మ్యాచ్‌ల్లో తలపడితే 6 మ్యాచ్‌లు కోల్‌కతా నెగ్గగా మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలుపొందింది. గణాంకాలు అన్నీ కోల్‌కతాకు అనుకూలంగా ఉండటం, అలాగే సొంతమైదానం ఈడెన్‌గార్డెన్ కావడం కోల్‌కతానైట్ రైడర్స్ కి కలిసొచ్చే అంశాలు. మరోవైపు కప్పు వేటలో ఉన్నాం అని తెలిపేందుకు రైజర్స్‌కూడా బలంగా ఎదురు నిలవనుంది. దీంతో ఈ పోరు ఉత్కంఠకు వేదికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.