KKR Vs PBKS: మళ్లీ మెరిసిన రింకూ - పంజాబ్‌పై చివరి బంతికి కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ!
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లతో ఓటమి పాలైంది.
Kolkata Knight Riders vs Punjab Kings: ఐపీఎల్ 2023 సీజన్ 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS) 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ నితీష్ రాణా (51: 38 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. చివర్లో ఒత్తిడిలో రింకూ సింగ్ (21 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) చివరి బంతికి బౌండరీతో మ్యాచ్‌ను గెలిపించాడు.
పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ (57: 47 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి మూడు వికెట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పట్టిక మరింత ఆసక్తికరంగా మారింది. `మ్యాచ్‌కు ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న కోల్‌కతా ఒక్కసారిగా ఐదో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు నార్మల్ స్టార్ట్ లభించింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (38: 24 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), రహ్మనుల్లా గుర్బాజ్ (15: 12 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 38 పరుగులు జోడించింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. తర్వాత కాసేపటికే జేసన్ రాయ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు.
అయితే వెంకటేష్ అయ్యర్ (11: 13 బంతుల్లో), కెప్టెన్ నితీష్ రాణా (51: 38 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. వీరిద్దరినీ రాహుల్ చాహర్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఈ దశలో ఆండ్రీ రసెల్ (42: 23 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), రింకూ సింగ్ (21 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడుతూ జట్టును ముందుకు నడిపించారు. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆండ్రీ రసెల్‌ను అవుట్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో రింకూ సింగ్ బౌండరీతో గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను అవుట్ చేసి హర్షిత్ రాణా మొదటి వికెట్ పడగొట్టాడు. కాసేపటికే వన్ డౌన్ బ్యాటర్ భానుక రాజపక్స కూడా డకౌట్ అయ్యాడు. లియాం లివింగ్‌స్టోన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో పంజాబ్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పటికి పవర్ ప్లే కూడా పూర్తి కాలేదు.
ఆ తర్వాత శిఖర్ ధావన్‌కు జితేష్ శర్మ జత కలిశాడు. వీరు నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అయితే కీలకమైన దశలో వీరిద్దరూ అవుటయ్యారు. శామ్ కరన్ కూడా విఫలం అయ్యాడు. చివర్లో రిషి ధావన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్ వేగంగా ఆడారు. దీంతో పంజాబ్ కింగ్స్ చివరి ఐదు ఓవర్లలో 55 పరుగులు చేసింది. మొత్తం 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు సాధించింది. కోల్‌కతా బ్యాటర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణాకు రెండు వికెట్లు దక్కాయి. సుయాష్ శర్మ, నితీష్ రాణాలు చెరో వికెట్ తీసుకున్నారు.