KKR vs PBKS IPL 2024 Punjab Kings won by 8 wkts: ఐపీఎల్(IPL)-2024లో రికార్డులు నమోదు అవుతున్నాయి. ఈ ఎడిషన్ లో రికార్డు ఛేజింగ్‌తో కోల్‌కతా(KKR)పై పంజాబ్(PBKS) భారీ విజయాన్ని నమోదు చేసింది. కోల్కత్త ఇచ్చిన 262 పరుగుల లక్ష్యాన్ని.. పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెయిర్‌స్టో 48 బంతుల్లో 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 పరుగులు, , ప్రభ్‌సిమ్రన్ సింగ్ 20 బంతుల్లో 54 పరుగులతో అర్ధశతకాలతో అదరగొట్టారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 1 వికెట్ తీశారు. అంతుకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. సాల్ట్, నరైన్ చెలరేగి ఆడారు. అర్ష్‌దీప్ 2, కరన్ 1, రాహుల్ 1, హర్షల్ 1 వికెట్ తీశారు.
కోల్‌కత్తా దూకుడు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తాకు.. ఓపెనర్లు సునీల్ నరైన్... ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభం ఇచ్చారు. రెండో ఓవర్ నుంచి ఊచకోత ప్రారంభించిన సునీల్ నరైన్ ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో తన విధ్వంసాన్ని ప్రారంభించిన నరైన్ తర్వాత మరింత చెలరేగిపోయాడు. కానీ పదిహేడు పరుగుల వద్ద నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన పంజాబ్... దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఫిల్ సాల్ట్ కూడా మెరుపు బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సరికే కోల్‌కత్తా ఒక్క వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. సునీల్ నరైన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. చాహర్ బౌలింగ్‌లో నరైన్ ఎల్బీగా అంపైర్ అవుటివ్వగా.. కోల్‌క్తతా రివ్యూకు వెళ్లింది. ఇది నరైన్‌కు అనుకూలంగా వచ్చింది. నరైన్-సాల్ట్ మెరుపు బ్యాటింగ్‌తో 10 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసింది. 138 పరుగుల వద్ద కోల్‌కత్తా తొలి వికెట్ కోల్పోయింది. 32 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 71 పరుగులు చేసి నరైన్ అవుటయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి నరైన్ పెవిలియన్ చేరాడు. అనంతరం సాల్ట్ కూడా అవుటయ్యాడు. 37బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు చేసి సాల్ట్ కూడా పెవిలియన్ చేరాడు. తర్వాత అండి రస్సెల్ 24, శ్రేయస్ అయ్యర్ 28, వెంకటేష్ అయ్యర్ 39 పరుగులతో రాణించడంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్ష్‌దీప్ రెండు, శామ్ కరణ్ ఒకటి... హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశారు.
అదరగొట్టిన పంజాబ్ ..
కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు పంజాబ్ సిద్ధమైంది. ప్రభ్‌సిమ్రన్ దూకుడుగా ఆడటంతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి అయ్యింది. అటు జానీ బెయిర్‌స్టో కూడా చెలరేగిపోతుండగా అనుకుల్ రాయ్ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి అనవసర పరుగుకు యత్నించి ప్రభ్‌సిమ్రన్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ దూకుడుగా ఆడుతుండటంతో పది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్ ఒక్క వికెట్ నష్టానికి 132 కి చేరింది. అయితే 178 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్ భారీషాట్‌కు యత్నించి శ్రేయస్ చేతికి చిక్కాడు. 45 బంతుల్లోనే జానీ బెయిర్‌స్టో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అటు శశాంక్ కూడా విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో , శశాంక్ ఇద్దరు అదరగొట్టడంతో కోల్‌కతాపై 262 పరుగులను టార్గెట్‌ను కేవలం 18.4 ఓవర్లలోనే పూర్తి చేసింది.