IPL 2025 KKR OUT Of Playoff Race: కేకేఆర్ ఔట్.. ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన నాలుగో జట్టు కేకేఆర్.. జోష్ లో ఆర్సీబీ..
కేకేఆర్ కథ ముగిసింది. నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం ఆర్సీబీతో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క పాయింటే లభించింది. దీంతో 12 పాయింట్లతో టోర్నీ ప్లే ఆఫ్ బెర్త్ నుంచి వైదొలిగింది.

IPL 2025 KKR VS RCB Updates: ఐపీఎల్ రీ స్టార్ట్ శకునం బాగాలేదు. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎడతెరిపి లేని వర్షంతోపాటై ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్ లో కచ్చితంగా నెగ్గాలని భావించిన కేకేఆర్.. మ్యాచ్ రద్దు కావడంతో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. దీంతో 13 మ్యాచ్ ల నుంచి కేవలం 12 పాయింట్లు సాధించిన కేకేఆర్.. మరో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ నాకౌట్ చేరే అవకాశం లేదు. ఇక ఈ మ్యాచ్ ద్వారా లభించిన పాయింట్ తో ఆర్సీబీ 17 పాయింట్లతో టాప్ ప్లేస్ ను దక్కిచుకుంది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండటంతో టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ థాంక్స్ చెప్పాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో కోహ్లీ యాక్షన్ ను చూడలేకపోయారు.
Match 5️⃣8️⃣ between @RCBTweets and @KKRiders has been called off due to rain.
— IndianPremierLeague (@IPL) May 17, 2025
Both teams get a point each.#TATAIPL | #RCBvKKR pic.twitter.com/igRYRT8U5R
అ తప్పిదంతోనే..
ఇక గతేడాది సూపర్ ఆటతీరుతో లీగ్ దశలో దుమ్మురేపి టాప్ ర్యాంకు సాధించిన కేకేఆర్.. ఏకంగా చాంపియన్ గా నిలిచింది. అయితే ఈ ఏడాది మాత్రం నిరాశ జనక ప్రదర్శనతో నాకౌట్ రేసు నుంచి ఎలిమినేట్ అయిన నాలుగో జట్టుగా నిలిచింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, తాజాగా ఈ జాబితాలో కేకేఆర్ కూడా చేరింది. సొంతగడ్డపై పరాజయాలతో చేజేతులా నాకౌట్ బెర్త్ నుంచి దూరమైంది. ఇక బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. రూ.23.75 కోట్లతో కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తుస్సుమన్నాడు.
జోష్ లో ఆర్సీబీ..
ఈ ఏడాది అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్న ఆర్సీబీ.. దాదాపుగా నాకౌట్ కు అర్హత సాధించింది. ఇప్పుడు ఆ జట్టు ఫోకస్ అంతా.. టాప్-2లో నిలవడంపైనే ఉంది. అలా నిలిస్తే, క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. దీని ద్వారా ప్లేఆఫ్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, ఫైనల్ చేరేందుకు మరో అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపైనే ఆర్సీబీ దృష్టి పెట్టింది. ఇక ఐపీఎల్ రీస్టార్ట్ మ్యాచ్ అయిన కేకేఆర్- ఆర్సీబీ రద్దవ్వడంతో క్రికెట్ ప్రేమికులు నిరాశపడ్డారు. ఇక ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా,, రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ .. జైపూర్ వేదికగా తలపడుతుంది. మరో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తో ఢీల్లీ వేదికగా అమీతుమీ తేల్చుకుంటుది.




















