RR vs MI : రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - ఆసక్తికర పోరు, గెలిచేది ఎవరు?
IPL 2024: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది.
IPL 2024 RR vs MI Preview and Prediction : ఐపీఎల్(IPL)లో జైపుర్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్(RR)పై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై ఇండియన్స్(MI) సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన తొలి మ్యాచ్‌లో ముంబైను వారి సొంతగడ్డపైనే రాజస్థాన్ రాయల్స్.... మట్టికరిపించింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రాజస్థాన్ దూసుకెళుతోంది. మరోవైపు సీజన్ ఆరంభంలో తడిబడిన ముంబై మెల్లగా పుంజుకుంటోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో తృటిలో ఓటమిని తప్పించుకున్న ముంబై.. తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది.
బ్యాటింగ్ ఓకే.... మరి బౌలింగ్.....
బలమైన బ్యాటింగ్ లైనప్ ముంబై ఇండియన్స్ సొంతం. కానీ బౌలింగ్‌లో స్పీడ్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్లు విఫలమవుతుండడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఈ సీజన్‌లో 13 వికెట్లతో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో ఉండగా , మరో ముంబై పేసర్ కోయెట్జీ 12 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నా భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఆకాశ్ మధ్వాల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిలకడగా రాణించలేకపోతున్నారు. స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక వికెట్ తీయగా, అఫ్గాన్ స్పిన్నర్ నబీను కెప్టెన్ పాండ్య సమర్థవంతంగా ఉపయోగించుకోలేక పోతున్నాడు. అటు బ్యాటింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అదిరే ఫామ్‌లో ఉండగా... మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ధాటి ఆడుతున్నప్పటికీ ఎక్కువసేపు క్రీజులో ఉండడం లేదు. దక్కిన శుభారంభాలను కిషన్ పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ పర్వాలేదనిపిస్తున్నాడు. బ్యాటర్‌గా పాండ్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం ముంబైకు అతిపెద్ద సానుకూలంశం. గాయం నుంచి కోలుకోని వచ్చిన సూర్య.... ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించాడు.
టాప్‌లోనే ఉండాలని.....
రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అదిరే ఆటతో అదరగొడుతోంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటూ బౌలింగ్‌లో రాణిస్తూ... దూసుకుపోతోంది. ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలో బ్యాటర్లను హడలెత్తిస్తుండగా... డెత్ ఓవర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ కట్టడి చేస్తున్నారు. స్పిన్నర్ చాహల్ రాణిస్తుండగా.... సీనియర్ స్పిన్నర్ ఆశ్విన్ విఫలమవుతుండడం రాజస్థాన్‌కు ప్రతికూలంశం. బ్యాటింగ్‌లో అద్భుత ఫామ్‌లో రియాన్ పరాగ్ నిలకడగా రాణిస్తున్నాడు. జోస్ బట్లర్ ఫామ్‌లోకి రావడం రాజస్థాన్ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసింది. ఈ సీజన్‌లో బట్లర్ ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. కెప్టెన్ సంజు కూడా రాణిస్తుండడం జట్టు దూసుకుపోతుంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్.... వరుసగా విఫలమవుతుండడం రాజస్థాన్‌ను కలవరపెట్టే అంశం.
జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్
రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.
ముంబయి ఇండియన్స్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార.