IPL 2024: పవర్ ప్లేలో SRH విధ్వంసం, లీగ్ చరిత్రలో రికార్డ్ స్కోర్ చేసిన ట్రావిస్ హెడ్, అభిషేక్
DC vs SRH: ఐపీఎల్‌లో ఆరు ఓవర్లకు 105 పరుగుల రికార్డు హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో కాలగర్భంలో కలిసిపోయింది. పవర్ ప్లేలో హైదరాబాద్ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.
Highest score in power Play By Sunrisers Hyderabad: ఈ ఐపీఎల్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆట చూస్తే.. మతిపోతోంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్ల విధ్వంసం హద్దులు దాటింది. పవర్ ప్లేలోనే 120 పరుగులు చేసి ఐపీఎల్ కొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో ఆరు ఓవర్లకు 105 పరుగుల రికార్డు హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో కాలగర్భంలో కలిసిపోయింది. ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసానికి మాటలే సరిపోలేదు. తొలి ఆరు ఓవర్లలో హైదరాబాద్ ఓపెనర్లు 11 సిక్సర్లు.. 13 ఫోర్లు కొట్టారంటే వారి బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరికీ బౌలింగ్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు భయపడిపోయారు. పవర్ ప్లేలో హైదరాబాద్ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.
రైజింగ్‌లో రైజర్స్
చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ నిలకడగా రాణిస్తోంది. 2021, 2022లో 8వ, 2023లో ఏకంగా10వ స్థానానికి పరిమితమైన సన్‌రైజర్స్ ఈసారి ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఎదురుదాడికి దిగుతూ బౌలర్లను ఉతికేస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఉతికి ఆరేస్తోంది. అరివీర భయంకర జట్లైన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్‌పై ఇప్పటికే విజయం సాధించిన హైదరాబాద్... ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పిడుగులా పడింది.
🤝🔥#PlayWithFire #DCvSRH https://t.co/53N0oXcbel
— SunRisers Hyderabad (@SunRisers) April 20, 2024
గత సీజన్‌లలో హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే అభిమానులు సహా ఎవ్వరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానులందరూ టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. గత సీజన్‌లో 200 పరుగులు చేసేందుకు సతమతమైన జట్టు తలరాత ఇప్పుడు మారింది. సునాయసంగా 200కుపైగా పరుగులను బాదేస్తోంది. ముంబైపై మెరుపు దాడి చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్.. తమ బ్యాటింగ్ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టి ఔరా అనిపించింది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఇదే జోరు కొనసాగిస్తే మరో కప్పు సన్‌రైజర్స్ ఖాతాలో చేరడం ఖాయం.