IPL 2024: వేదికల మార్పు తప్పదా, విదేశాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు!
IPL 2024: ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు జరగనుండడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ప్రభావం చూపనుంది. దీంతో రెండో విడత నుంచి మ్యాచ్‌లు విదేశాల్లో జరిగే అవకాశం ఉంది.
BCCI might shift second half of the series to another country: దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకునగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదట విడత పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా చివరి విడత జూన్ ఒకటిన జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నట్లు EC వెల్లడించింది. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా ప్రధాని మోదీ వరుసగా మూడోసారిఅధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తుండగా NDA జోరుకు కళ్లెం వేయాలని ప్రతిపక్ష ఇండియా సర్వ శక్తులు ఒడ్డుతోంది. అయితే ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు జరగనుండడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ప్రభావం చూపనుంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ ఐపీఎల్(IPL) యాజమాన్యం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో రెండో విడత నుంచి మ్యాచ్‌లు విదేశాల్లో జరిగే అవకాశం ఉంది.
వేదిక మార్పు తప్పదా...?
ఐపీఎల్ రెండో దశ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి దశ మ్యాచ్‌లు అన్నీ భారత్(INDIA)లోనే జరగనుండగా... రెండో దశ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ(BCCI), ఐపీఎల్(IPL) కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. ఇప్పటికే ఆటగాళ్ల పాస్‌పోర్టులను ఫ్రాంచైజీలు తీసుకుంటున్నాయని సమాచారం. పాస్‌పోర్టు కాలపరిమితికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కానీ భారత్ వేదికగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మాత్రం గతంలోనే స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దుబాయ్ వేదికగా మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందనేది కొందరి అభిప్రాయమని.... ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరిస్తున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
వెంటాడుతున్న గాయాలు
మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభం కానుంది. ఈసారి అన్ని జట్లు ఎలాగైనా కప్పు గెలుచుకోవాలని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. కానీ చాలా జట్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమవ్వగా... ఇప్పుడు మరో స్టార్ ఆటగాడు కూడా దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడీ(Lungi Ngidi)ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడీ ప్రకటించాడు. ఎంగిడీ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ జేక్‌ప్రేజర్ మెక్ గుర్క్(McGurk) ను ఢిల్లీ జట్టులోకి తీసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన మెక్‌గుర్క్ హార్డ్‌హిట్టింగ్ ఓపెనింగ్ బ్యాటర్‌తో పాటు లెగ్‌స్పిన్నర్. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌ప్రారంభమవుతున్న వేళ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్(IPL) ప్రారంభానికి ముంబై ఇండియన్స్(MI)కు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్యా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోలేదని... అతను ఐపీఎల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి.