Virat Kohli: నాలుగు అవార్డులతో దుమ్ము లేపిన విరాట్ - ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాలుగు అవార్డులు గెలుచుకున్నాడు.
Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్ 20వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని ఓడించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన కనిపరిచాడు. విరాట్‌కు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో సహా మొత్తం 4 అవార్డులు కూడా లభించాయి.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 50 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీని ఆధారంగా ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు చేరుకోగలిగింది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆర్‌సీబీ ఢిల్లీని 20 ఓవర్లలో 151 పరుగులకే పరిమితం చేసింది.
మ్యాచ్ తర్వాత కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ లభించగా దీంతోపాటు అతనికి మోస్ట్ వాల్యూబుల్ అసెట్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు సాధించినందుకు కూడా అవార్డులు లభించాయి. విరాట్ కోహ్లీ ఈ అవార్డుల నుంచి మొత్తం రూ. నాలుగు లక్షలు పొందాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ప్రదర్శన గురించి చెప్పాలంటే అతను ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 71.33 సగటుతో 214 పరుగులు చేశాడు, ఇందులో మూడు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయం లభించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితం అయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (50: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ తరఫున మనీష్ పాండే (50: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇది ఢిల్లీకి వరుసగా ఐదో ఓటమి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డు మీద రెండు పరుగులు చేరేసరికి ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా, మిషెల్ మార్ష్, యష్ ధుల్ ఘోరంగా విఫలం అయ్యారు. తర్వాత కాసేపటికే డేవిడ్ వార్నర్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కేవలం మనీష్ పాండే మాత్రమే రాణించాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం నెమ్మదించింది. దీనికి తోడు బెంగళూరు పేసర్లు నిప్పులు చెలరేగడంతో పరుగులు రావడం మందగించింది. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితం అయింది.