SRH vs RR, IPL 2023: ఉప్పల్ మోత మోగేనా! సూపర్ డూపర్ SRH, RR ఫైటింగ్ నేడు!
SRH vs RR, IPL 2023: ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లాస్టియర్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్ మైదానం ఇందుకు వేదిక. నేటి పోరులో గెలిచేదెవరు?
SRH vs RR, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో ఆదివారం డబుల్ హెడర్ జరుగుతోంది. మొదటి మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, లాస్టియర్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్ మైదానం ఇందుకు వేదిక. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. నేటి పోరులో గెలిచేదెవరు? ఎవరి బలాబలాలు ఏంటి?
కొత్తగా.. గట్టిగా.. SRH
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! కేన్ విలియమ్సన్ నేతృత్వంలో జట్టు ఘోరంగా విఫలమైంది. ఆటగాళ్లు కుదురుకొనేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. గాయాల పాలవ్వడం, సమతూకం కుదరకపోవడంతో ఓటములు ఎదురయ్యాయి.
అప్పటి తప్పులను సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) వేలంలో సరిదిద్దుకుంది. పటిష్ఠమైన బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ లైనప్‌ను నిర్మించుకుంది. వేలంలో చురుకుగా స్పందించి టీ20 ఫార్మాట్‌కు సరిపోయే క్రికెటర్లను తీసుకుంది. నమ్ముకోదగ్గ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది.
ఇక మిడిలార్డర్లో విధ్వంసం సృష్టించే ప్లేయర్లను పట్టేసింది. కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ వన్‌డౌన్ లేదా సెకండ్ డౌన్‌లో కీలకంగా ఆడగలడు. హ్యారీ బ్రూక్ (Harry Brook), గ్లెన్ ఫ్లిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ దంచికొడతారు. అకేల్ హుస్సేన్, ఆదిల్ రషీద్‌తో స్పిన్ డిపార్టుమెంటును పటిష్ఠం చేసుకుంది.
యార్కర్ల కింగ్ నటరాజన్ (T Natarajan), జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌తో కూడిన పేస్ బౌలింగ్ యూనిట్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలదు. అద్దిరిపోయే ఫైనల్ ఎలెవన్‌ను ఎంచుకోవడమే కాకుండా సూపర్ డూపర్ ఇంపాక్ట్ ప్లేయర్లు సన్‌రైజర్స్‌కు ఉన్నారు.
రాయల్స్.. ఏమైనా చేయగలరు!
రెండేళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌లో (Rajastan Royals) ఎంతో మార్పు వచ్చింది. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) నాయకత్వంలో చక్కని జట్టును రూపొందించుకుంది. కుమార సంగక్కర, లసిత్ మలింగతో కూడిన సపోర్ట్ స్టాఫ్ చక్కని వ్యూహాలను రచిస్తోంది. గతేడాది రన్నరప్‌గా నిలవడమే ఇందుకు నిదర్శనం.
నిజానికి తామున్న ఫామ్‌లో 2022లో రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ గెలవాల్సింది. ఆల్‌రౌండ్ విభాగంలో ఫినిషర్లు లేకపోవడం, డెత్ ఓవర్ బౌలింగ్ స్పెషలిస్టులు లేకపోవడంతో ఇబ్బంది పడింది. ఈసారి వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్‌ను తీసుకోవడం గుడ్‌మూవ్. గాయపడ్డ యువపేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో సందీప్ శర్మను తీసుకుంది. ఉప్పల్ పిచ్ అతడికి కొట్టిన పిండి. కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌కు అండగా నిలిచిన పేసర్ ఇతడు.
చివరి సీజన్లో రాజస్థాన్‌ను డెత్ బౌలింగ్ కలవరపెట్టింది. ట్రెంట్ బౌల్ట్ ఉన్నప్పటికీ ప్రసిద్ధ్, ఒబెడ్ మెకాయ్ వంటి పేసర్లు ఒత్తిడిలో ఎక్కువ పరుగులు ఇచ్చేశారు. 2020 నుంచి ఆ జట్టు పేసర్లు చివరి 4 ఓవర్లలో 10 వికెట్లే తీశారు. ఓవర్‌కు 9.54 పరుగులు ఇచ్చారు. హోల్డర్ ఇప్పుడీ లోటును పూడ్చనున్నాడు.
జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్‌మైయర్, రియాన్ పరాగ్, అక్షత్, హోల్డర్, అశ్విన్, బౌల్ట్‌తో కూడిన రాజస్థాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చడం అంత ఈజీ కాదు. ఇందులో ఏ ఇద్దరు నిలబడ్డా బంతులు స్టాండ్స్‌లోకి వెళ్లిపోతాయి. యూజీ, పరాగ్, జంపా గింగిరాలు తిప్పగలరు.
ఉప్పల్ పిచ్ బౌలర్లదే!
ఉప్పల్ పిచ్ కొంత మందకొడిగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న టార్గెట్లనూ కాపాడుకోవచ్చు. ముంబయి ఇండియన్స్ ఇలాగే ట్రోఫీ కొట్టింది. 2018 నుంచి ఫాస్ట్ బౌలర్ల మొత్తం సగటు 25.17గా ఉంది. ఎకానమీ 8.07. దీనిని బట్టి పిచ్ బౌలర్లకు ఎంత అనుకూలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిలబడితే బ్యాటర్లు పరుగులు చేయొచ్చు. వాతావరణం కాస్త ఉక్కగానే ఉంటోంది. డ్యూ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.