పంజాబ్, కోల్‌కతా రాతలు మారేనా! కొత్త సారథులు ఏం చేస్తారో..?
PBKS vs KKR Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పట్నుంచీ ఉన్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ కూడా ఉన్నాయి. ఐపీఎల్ - 16 లో శనివారం ఈ రెండు జట్లూ తలపడనున్నాయి.
PBKS vs KKR Match Preview: సీజన్‌కు ఓ కెప్టెన్‌ను మార్చే పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ 16వ ఎడిషన్ లో కూడా ఆ సంప్రదాయాన్నే పాటించింది. పంజాబ్ కింగ్స్ (PBKS) కు ఈసారి శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా ఐపీఎల్ లో రెండు సార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా ఈసారి తమ రెగ్యులర్ సారథి శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో తాత్కాలిక కెప్టెన్‌గా నితీశ్ రాణాను ఎంపిక చేసింది. శనివారం ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. మరి ఈ ఇద్దరు కొత్త సారథులు టోర్నీలో తాము ఆడబోయే తొలి మ్యాచ్ లలో తమ ఫ్రాంచైజీలకు శుభారంభాలిస్తారా..?
గాయాలతో సావాసమే..
కేకేఆర్ రెగ్యులర్ కెప్టెన్ అయ్యర్ లేకపోవడంతో (ఫస్టాఫ్ వరకు) నితీశ్ రాణా జట్టును నడిపించనున్నాడు. అనుభవలేమికి అతడికి అడ్డంకిగా మారింది. కెప్టెన్ గానే గాక బ్యాటర్ గా కూడా అయ్యర్ లేని లోటు సుస్పష్టం. అతడితో పాటు టోర్నీలో మూడు మ్యాచ్ లకు బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్, ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ అందుబాటులో ఉండటం లేదు. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఇంకా జట్టుతో కలవలేదు. డెత్ ఓవర్లలో అతడు లేకపోవడం కేకేఆర్ కు ఎదురుదెబ్బే..
2021 సీజన్ లో ఓపెనర్ గా రాణించి టీమిండియాలో ప్లేస్ కొట్టేసిన వెంకటేశ్ అయ్యర్ గత సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ లో అతడు శుభారంభాలు అందించడం కేకేఆర్ కు అత్యావశ్యకం. అయితే అతడికి ఓపెనింగ్ జోడీగా అఫ్గాన్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్బాజ్ గానీ తమిళనాడు కుర్రాడు ఎన్. జగదీశన్ గానీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్ ను దాటి సారథ్య పగ్గాలు చేపట్టిన నితీశ్ రాణా ఏ మేరకు రాణించగలడన్నది చూడాలి. ఫెర్గూసన్ లేకపోవడంతో పేస్ బాధ్యతలు ఉమేశ్ యాదవ్ మోయనున్నాడు. ఈ ఏడాది కేకేఆర్ కు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ పై ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఇక హిట్టర్ రింకూ సింగ్ నిలిస్తే కేకేఆర్ భారీ స్కోర్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
పంజాబ్ పరిస్థితి అంతే..
ఇంతవరకు ఐపీఎల్ లో కప్ కొట్టని పంజాబ్.. ఈ ఏడాది అది సాధించాలనే పట్టుదలతో ఉంది. గతేడాది డిసెంబర్ లో ముగిసిన వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ పై ఏకంగా రూ. 18.5 కోట్లు వెచ్చించింది. అయితే కరన్ ఒక్కడే ఉంటే సరిపోదుగా.. పంజాబ్ కీలక ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కు ఈసీబీ ఇంకా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వలేదు. మరో కీలక బౌలర్ కగిసొ రబాడా కూడా తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు. అర్ష్‌దీప్ సింగ్ ఉన్నా గత కొంతకాలంగా అతడి బౌలింగ్ లయ తప్పింది. టీ20 ప్రపంచకప్ లో జింబాబ్వే తరఫున రాణించిన సికందర్ రజ ఐపీఎల్ లో ఎలా ఆడతాడో చూడాలి. ధావన్, భానుక రాజపక్స మినహా ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవమున్న స్పెషలిస్టు బ్యాటర్ లేకపోవడం పెద్ద లోటు.
ఇంపాక్ట్ ప్లేయర్ అంచనా..
ఈ సీజన్ నుంచి అమల్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను వాడుకోవాలనుకుంటే పంజాబ్.. రిషి ధావన్ ను కేకేఆర్ డేవిడ్ వీస్ ను వాడుకోవచ్చు.
పిచ్..
మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మొహాలీ పిచ్ సంప్రదాయబద్దంగా బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఇన్నింగ్స్ లో తొలి ఓవర్లలో బౌలర్లకు కూడా కాస్త సహకరించే అవకాశాలున్నాయి.
తుది జట్లు (అంచనా)
కేకేఆర్ : వెంకటేశ్ అయ్యర్, జగదీశన్ లేదా గుర్బాజ్ ఖాన్, నితీశ్ రాణా (కెప్టెన్), మణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
పీబీకేఎస్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రబ్‌సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కరన్, సికందర్ రజ, హర్‌ప్రీత్ బ్రర్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చహర్