RR vs RCB, Match Highlights: శెభాష్ షాబాజ్! డీకే అటాక్! RRపై RCB ఊహించని విక్టరీ
RR vs RCB, Match Highlights: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.
RR vs RCB, Match Highlights: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. 170 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేయలేకపోయింది. వికెట్లు పడి రన్‌రేట్ పెరిగిన తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (44; 23 బంతుల్లో 7x4, 1x6) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. షాబాజ్ అహ్మద్ (45; 26 బంతుల్లో 4x4, 3x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు రాజస్థాన్‌లో జోస్ బట్లర్ (70; 47 బంతుల్లో 0x4, 6x6), హెట్‌మైయిర్ (42; 31 బంతుల్లో 4x4, 2x6) అజేయంగా నిలిచారు. దేవదత్ పడిక్కల్ (37; 29 బంతుల్లో 2x4, 2x6) రాణించాడు.
Dinesh Karthik అటాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేదన ఇంట్రెస్టింగా సాగింది. ఓపెనర్లు డుప్లెసిస్ (29; 20 బంతుల్లో 5x4), అనుజ్ రావత్ (26; 25 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడారు. పవర్‌ప్లే అడ్వాంటేజ్ తీసుకొని ఫీల్డర్ల మీదుగా బౌండరీలు కొట్టారు. దాంతో 6.2 ఓవర్లకే స్కోరు 50 దాటింది. వన్‌సైడ్‌గా మారుతున్న మ్యాచ్‌ను డుప్లెసిస్‌ను జట్టు స్కోరు 55 వద్ద ఔట్ చేసి చాహల్ బ్రేక్ ఇచ్చాడు. మరికాసేపటికే అనుజ్ రావత్‌ను సైని ఔట్ చేశాడు.అప్పటికి స్కోరు 61. మరో పరుగు వద్దే విరాట్ కోహ్లీ (5)ని శాంసన్ రనౌట్ చేశాడు. డేవిడ్ విల్లే (0)ను యూజీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. రూథర్ ఫర్డ్ (5) తక్కువకే ఔటవ్వడంతో 87కే ఆర్‌సీబీ 5 వికెట్లు చేజార్చుకుంది. రాజస్థాన్ పట్టుబిగించిన సమయంలో దినేశ్ కార్తీక్ విజృంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదేసి ఊపు తీసుకొచ్చాడు. యాష్ వేసిన 14వ ఓవర్లో 21 రన్స్ సాధించాడు. రన్‌రేట్‌ను అదుపులోకి తెచ్చాడు. షాబాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 33 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఆఖర్లో షాబాజ్ ఔటైనా మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో జట్టుకు విజయం అందించాడు.
Jos Buttlerకు హ్యాట్సాఫ్
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా టఫ్‌గా ఉంది. బెంగళూరు బౌలర్లు నెమ్మది బంతులతో ఇబ్బందులు పెట్టారు. అయినా రాజస్థాన్ డీసెంట్ స్కోర్ చేసిందంటే ఓపెనర్ జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, హెట్‌మైయిరే (Shimron Hetmyer) కారణం. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (4) త్వరగా ఔటైనా గత మ్యాచులో సిక్సర్లతో సెంచరీ కొట్టిన బట్లర్ (Jos Buttler) ఈసారి నిలకడగా ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ (Devdutt Padikkal) అతడికి తోడుగా అద్భుతంగా ఆడాడు. చక్కని బౌండరీలు బాదుతూ, సింగిల్స్ తీస్తూ స్కోరు పెంచాడు. వీరిద్దరూ 49 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 76 వద్ద పడిక్కల్‌ను హర్షల్ ఔట్ చేశాడు. మరో 10 పరుగులకే బౌలర్ హసరంగకే సంజు శాంసన్ (8) సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. ఈ సిచ్యువేషన్‌లో హర్షల్, హసరంగ కలిసి పరుగుల్ని నియంత్రించారు. దాంతో 18 ఓవర్ల వరకు ఆర్‌ఆర్ స్కోరు 127-3గానే ఉంది. కానీ ఆఖరి రెండు ఓవర్లలో బట్లర్, హెట్‌మైయిర్ కలిసి సిక్సర్లు బాది ఏకంగా 42 పరుగులు చేయడంతో స్కోరు 169కి చేరుకుంది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 51 బంతుల్లో 83 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడం ప్రత్యేకం.