RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవిచంద్రన్ అశ్విన్ (40 నాటౌట్: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) దగ్గరుండి మ్యాచ్‌ను గెలిపించాడు.
మెరుపు ఆరంభాన్ని కొనసాగించలేక..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి మెరుపు ఆరంభం లభించింది. ఫాంలో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి ఓవర్లోనే అవుటైనా... తర్వాత వచ్చిన మొయిన్ అలీ చెలరేగిపోయాడు. మొదటి బంతి నుంచి విరుచుకు పడ్డాడు. ముఖ్యంగా బౌల్ట్ వేసిన ఆరో ఓవర్లో ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు మగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టానికి ఏకంగా 75 పరుగులు చేసింది.
అయితే ఆ తర్వాత చెన్నైకి కష్టాలు మొదలయ్యాయి. డెవాన్ కాన్వే, జగదీషన్, అంబటి రాయుడు 10 పరుగుల తేడాతో అవుటయ్యారు. దీంతో ధోని, మొయిన్ అలీ నిదానించారు. చివర్లో కూడా రాజస్తాన్ బౌలర్లు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా టైట్ బౌలింగ్ వేశారు. వేగంగా పరుగులు చేసే క్రమంలో మొయిన్, ధోని కూడా అవుటయ్యారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులకు పరిమితం అయింది.
మొదటి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసిన చెన్నై, తర్వాత 14 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్తాన్ బౌలర్లలో చాహల్, మెకాయ్ రెండేసి వికెట్లు తీశారు. బౌల్ట్, ప్రసీద్ కృష్ణలకు చెరో వికెట్ దక్కింది.
అదరగొట్టిన అశ్విన్
151 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. జోస్ బట్లర్ (2: 5 బంతుల్లో), సంజు శామ్సన్ (15: 20 బంతుల్లో, రెండు ఫోర్లు), దేవ్‌దత్ పడిక్కల్‌లు (3: 9 బంతుల్లో) విఫలం అయ్యారు. అయినా ఒకవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59: 44 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడాడు.
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం జైస్వాల్ కూడా అవుట్ కావడంతో రాజస్తాన్ 104 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అశ్విన్ చెలరేగి ఆడటంతో రాజస్తాన్ ఐదు వికెట్లతో విజయం సాధించింది.