PBKS VS RCB: కొత్త కెప్టెన్లలో బోణీ కొట్టేదెవరో - పంజాబ్, బెంగళూరు మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య నేడు సాయంత్రం మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లూ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి.
11 సంవత్సరాల తర్వాత తొలిసారి...
డీవై పాటిల్ స్టేడియంలో 2011లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. వికెట్ మీద చెప్పుకోదగ్గ స్థాయిలోనే బౌన్స్ ఉంది. ఇది బ్యాటర్లకు సహకరించనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెళ్లలో, హాట్‌స్టార్ యాప్‌లో వీటిని లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.
ఫాఫ్ ఏం చేస్తాడో?
దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుఫ్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతోపాటు విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా లీడ్ చేయనున్నాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు ఫినిషర్ పాత్ర లభించే అవకాశం ఉంది. మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, డేవిడ్ విలే తెలివిగా బౌలింగ్ చేయాలి. లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ స్పిన్ సామర్థ్యం కూడా ముఖ్యమే.
మయాంక్ ముఖ్యమే...
పంజాబ్‌కు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించనున్నారు. మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. ఆల్ రౌండర్ లియాం లివింగ్‌స్టోన్, హార్డ్ హిట్టర్ షారుక్ ఖాన్‌లకు హిట్టింగ్ సామర్థ్యం ఉంది. ఇక అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌కు కీలకం కానున్నారు. ప్రస్తుతం కగిసో రబడ క్వారంటైన్‌లో ఉన్నాడు. రాహుల్ చాహర్ స్పిన్‌తో మాయాజాలం చేయగలడు.
ధావన్‌ను ఆర్సీబీ మీద మంచి రికార్డే ఉంది. వారిపై 22 ఇన్సింగ్స్‌లో 615 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 122.26 కాగా... ఆరు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.సీనియర్ పేసర్ సందీప్ శర్మ ఆర్సీబీపై 15 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఫాఫ్ డుఫ్లెసిస్‌కు పంజాబ్ మీద మంచి రికార్డు ఉంది. ఏకంగా 61.4 సగటుతో 614 పరుగులను సాధించాడు. వీటిలో ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఈ రెండు జట్లూ ఇంతవరకు 28 సార్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ 15 సార్లు విజయం సాధించగా... ఆర్సీబీ విజయాల సంఖ్య 13గా ఉంది.
పంజాబ్ తుదిజట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, లియాం లివింగ్ స్టోన్, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా)
ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లొమ్రోర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్