PBKS Vs CSK: దంచేసిన ధావన్ - చెన్నై ముంగిట భారీ లక్ష్యం - విఫలమైన సూపర్ కింగ్స్ బౌలర్లు!
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (88 నాటౌట్: 59 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనకు భనుక రాజపక్స (42: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారాన్ని అందించాడు. చెన్నై విజయానికి 120 బంతుల్లో 188 పరుగులు కావాలి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ మెల్లగా ప్రారంభం అయింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (18: 21 బంతుల్లో, రెండు ఫోర్లు) పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నాడు. మొదటి వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం మహీష్ ధీక్షణ బౌలింగ్‌లో మయాంక్ అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.
ఈ వికెట్‌తో కష్టాలు పంజాబ్‌కు కాకుండా చెన్నైకి మొదలయ్యాయి. శిఖర్ ధావన్‌తో జత కలిసిన భనుక రాజపక్స (42: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 71 బంతుల్లోనే 110 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో చెన్నైపై ఏ జట్టయినా నమోదు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. స్లాగ్ ఓవర్లలో స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి రాజపక్స అవుటయ్యాడు.
దీంతో క్రీజులోకి వచ్చిన లియాం లివింగ్ స్టోన్ (19: 7 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఒక వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో ధావన్ సిక్సర్, బెయిర్‌స్టో బౌండరీ కొట్టడంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బౌలర్లు పంజాబ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వైడ్లు వేశారు. డ్వేన్ బ్రేవో రెండు వికెట్లు తీయగా... మహీష్ ధీక్షణకు ఒక వికెట్ దక్కింది.
View this post on Instagram